ఏసీబీకి చిక్కిన విలేజ్‌‌ సెక్రటరీ

  • ఇంటి నంబర్‌‌ ఆన్‌‌లైన్‌‌ కోసం రూ. 10 వేలు డిమాండ్‌‌
  • రూ. 8 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

నందిపేట, వెలుగు : ఇంటి నంబర్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ చేసేందుకు లంచం తీసుకున్న ఓ విలేజ్‌‌ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌‌గౌడ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌‌ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌‌ సుభాష్‌‌ ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. తన ఇంటి నంబర్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ చేయాలని విలేజ్‌‌ సెక్రటరీ నవీన్‌‌ను కలిశాడు. అయితే రూ. 10 వేలు ఇస్తేనే ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ చేస్తానంటూ సెక్రటరీ చెప్పడంతో రూ. 8 వేలు ఇచ్చేందుకు సుభాష్‌‌ ఒప్పుకున్నాడు. తర్వాత సుభాష్‌‌ ఏసీబీ ఆఫీసర్లను కలిసి విషయం చెప్పాడు. 

వారి సూచనలతో గురువారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ ఆఫీస్‌‌లో సెక్రటరీకి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సెక్రటరీ నవీన్‌‌కు పట్టుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీస్‌‌లో తనిఖీలు చేపట్టి పెండింగ్‌‌లో ఉన్న డాక్యుమెంట్లను సీజ్‌‌ చేశారు. విచారణ పూర్తయిన తర్వాత సెక్రటరీని రిమాండ్‌‌కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దాడిలో శ్రీనివాస్, నగేశ్‌‌ పాల్గొన్నారకు.