ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల స్వీకరణ

  • కేజ్రీవాల్ గౌరవార్థం ఆయన ​కుర్చీ ​ఖాళీ 
  • మరో కుర్చీలో కూర్చున్న సీఎం 
  • భరతుడిలా పాలిస్తానని వెల్లడి
  • మరో 4 నెలల్లో కేజ్రీవాల్ సీఎం అవుతారని ధీమా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎనిమిదో సీఎంగా ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్) ​లీడర్​ ఆతిశి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ  సమయంలో ఆమె ఆప్ ​చీఫ్​ అర్వింద్ ​కేజ్రీవాల్​ గౌరవార్థం ఆయన కుర్చీని ఖాళీగానే ఉంచారు. పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఆతిశి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రామాయణంలోని ఓ ఘట్టాన్ని ప్రస్తావించారు. 

“నాది ప్రస్తుతం రామాయణంలో భరతుడి పరిస్థితే. రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచి, భరతుడు అయోధ్యను పాలించాడు. నేను కూడా భరతుడిలా 4  నెలలు ఢిల్లీ సీఎంగా పనిచేస్తా. రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్​గెలిచి, మళ్లీ అధికారం చేపడతారని విశ్వసిస్తున్నా” అని వ్యాఖ్యానించారు. 

‘‘ కేజ్రీవాల్ పదవినుంచి తప్పుకొని పాలిటిక్స్​లో డిగ్నిటీకి ఉదాహరణగా నిలిచారు. ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ఎలాంటి అవకాశాన్ని వదులుకోలేదు” అని పేర్కొన్నారు. 

కేబినెట్​ మంత్రుల ప్రమాణం

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకెళ్లి ఇటీవలే బెయిల్​పై విడుదలైన అర్వింద్​కేజ్రీవాల్​ తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బాధపడి రాజీనామా చేశానని చెప్పారు.  త్వరలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష అని, తాను నిజాయితీపరుడు కాదు అని భావిస్తే ప్రజలు ఓటు వేయవద్దని కోరారు. 

తదుపరి సీఎంగా ఆతిశిని ప్రతిపాదించగా.. ఆప్​ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో లెఫ్టినెంట్​ గవర్నర్​ డీకే సక్సేనా రెండు రోజుల క్రితం ఆతిశితో సీఎంగా ప్రమాణం చేయించారు. తాజాగా, ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆతిశితోపాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్​ ఆహ్లావత్, గోపాల్​రాయ్, ఇమ్రాన్​ హుస్సేన్​, కైలాశ్​ గెహ్లాట్, సౌరభ్​ భరద్వాజ్​కేబినెట్​ మంత్రులుగా ప్రమాణం చేశారు.