అసలేం జరిగింది..? పుట్టిన రోజు నాడే అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్‎కు చెందిన యువకుడు పుట్టిన రోజు నాడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన 2024, నవంబర్ 13వ తేదీన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. తెలంగాణాలోని భువనగిరి జిల్లాకు చెందిన ఆర్యన్ రెడ్డి (23) అనే యువకుడి ఫ్యామిలీ ప్రస్తుతం హైదరాబాద్‎లోని ఉప్పల్‎లో నివాసం ఉంటోంది. ఉన్నత చదువుల కోసం ఆర్యన్ రెడ్డి అమెరికాకు వెళ్లాడు. 

జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉంటోన్న ఆర్యన్ కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ నెల (నవంబర్) 13వ తేదీన ఆర్యన్ పుట్టిన రోజు కాగా.. బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ హంటింగ్ రైఫిల్‎ను బయటకు తీయగా అది మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ ఆర్యన్ రెడ్డి చాతి నుండి దూసుకుపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 

వెంటనే గమనించిన తోటి స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఆర్యన్ రెడ్డి మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారులు, అతడి స్నేహితులు ఆర్యన్ రెడ్డి తల్లిద్రండులకు తెలియజేశారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త తెలుసుకుని ఆర్యన్ తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.