తొలిసారి డెన్మార్క్ యువతికి మిస్​యూనివర్స్ కిరీటం

  • విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న విక్టోరియా థెల్వింగ్
  • టాప్​ 30తోనే సరిపెట్టుకున్న ఇండియా యువతి రియా సింఘా

మెక్సికో: మిస్​ యూనివర్స్​– 2024 విజేతగా డెన్మార్క్​ యువతి నిలిచింది. విశ్వసుందరి కిరీటం 21 ఏండ్ల విక్టోరియా కేయిర్​ థెల్వింగ్​ను వరించింది. 125 మంది బరిలో నిలిచిన ఈ పోటీల్లో విక్టోరియా గెలిచి.. డెన్మార్క్​కు తొలిసారి మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.

 మెక్సికోలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్​ పోటీల్లో నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్సినా సెకండ్​ ప్లేస్​లో, మెక్సికోకు చెందిన మారియా ఫెర్నాండా బెల్ట్రాన్​ థర్డ్ ప్లేస్​లో నిలిచారు. 2003లో డెన్మార్క్​లో పుట్టిన విక్టోరియా.. జంతుసంరక్షణ అడ్వకేట్​గా పనిచేస్తున్నది. 

డెన్మార్క్​కు విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన తొలి యువతిగా ఆమె రికార్డు సృష్టించింది. విక్టోరియాకు కిరీటాన్ని 2023 విశ్వసుందరి షెన్నీస్​ పలాసియోస్​ అలంకరించింది. ‘‘కొత్త  అధ్యాయం మొదలైంది. 73వ మిస్​ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన డెన్మార్క్​కు అభినందనలు. 

మహిళా సాధికారతకు స్ఫూర్తినింపేలా విక్టోరియా ప్రయాణం ముందుకుసాగాలని ఆశిస్తున్నం” అంటూ మిస్​ యూనివర్స్​ పోటీల నిర్వాహకులు ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. భారత్​ నుంచి పోటీల్లో పాల్గొన్న గుజరాత్​కు చెందిన రియా సింఘా​ టాప్​ 30తోనే సరిపెట్టుకుంది.  

స్విమ్​ షూట్​ పోటీల నుంచే ఆమె వెనుదిరిగింది. ఫైనల్​ రౌండ్​లో 12 మంది పోటీ పడగా.. ఇందులో ఏడుగురు లాటిన్​ అమెరికా దేశాలకు  చెందిన వాళ్లే కావడం విశేషం.