ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో మహిళ సూసైడ్

  • హనుమకొండ జిల్లా ఎలుకుర్తిలో  ఘటన

ధర్మసాగర్, వెలుగు:  ఇంటి నిర్మాణానికి లోన్ తీసుకొని కట్టకపోతుండగా ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక మహిళ సూసైడ్ చేసుకుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తికి చెందిన కేతిరి వెంకటయ్యకు కూతురు ఎలేంద్ర (35)ను స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన అంగడి ఉపేందర్ కు ఇచ్చి 17 ఏండ్ల కింద పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఆరేండ్ల కింద ఎలేంద్ర  కొత్త ఇంటి నిర్మాణానికి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 15 లక్షలు లోన్ తీసుకుంది.  కొంత డబ్బులు కట్టింది. 

మిగతా ఈఎంఐలు చెల్లించకపోతుండగా కంపెనీ ఉద్యోగులు వేధిస్తుండగా ఆమె తండ్రికి చెప్పుకుంటూ బాధపడేది. ఫైనాన్స్ వేధింపులు ఆపకపోవడంతో పాటు ఇంటికి నోటీసులు అంటించారు.  దీంతో మనస్తాపం చెందిన ఆమె పుట్టింటికి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం తండ్రి ఇంటి ముందు చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటయ్య ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.