ఇంటి ముందున్న డ్రైనేజీలో పడిరెండేండ్ల పాప గల్లంతు

  •  తల్లి చూస్తుండగానే   కొట్టుకుపోయిన చిన్నారి 
  •  వర్షం నీటితో కాల్వలోకి భారీగా వచ్చిన వరద
  •  నిజామాబాద్​ సిటీలో ఘటన​ 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​లోని ఆనంద్​నగర్​ కాలనీలో ఓ ఇంటి ముందున్న డ్రైనేజీలో రెండేండ్ల పాప పడి కొట్టుకుపోయింది. తన బిడ్డ డ్రైనేజీలో పడడం చూసిన తల్లి పరిగెత్తుకు వచ్చేలోపు ప్రవాహంలో గల్లంతయ్యింది. అప్పటికే చీకటి కావడం, డ్రైనేజీ నిండా వర్షం నీరు పారుతుండడంతో పాప జాడ తెలియలేదు.  ఆనంద్​నగర్​కాలనీలో ఉంటున్న మారుతి, పూజ దంపతులకు ముగ్గురు పిల్లలు..కాగా అనన్య (2) చిన్న కూతురు. వీరు ఉంటున్న ఇంటి ఎదుట నాలుగు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల లోతు ఓపెన్​ డ్రైనేజీ ఉంది.  

బుధవారం సాయంత్రం గంటన్నర పాటు భారీ వర్షం పడగా ఎగువభాగంలోని నీరంతా డ్రైనేజీలో చేరి వరద పారింది. ఆ సమయంలో తండ్రి ఉద్యోగానికి వెళ్లగా ఇంట్లో పూజ తన పిల్లలతో ఉంది. వర్షం పడతుండగా అనన్య ఆడుకుంటూ బయటకు వచ్చి డ్రైనేజీ కాల్వలో పడింది. దీన్ని లోపల నుంచి చూసిన పూజ పరిగెత్తుకు వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు.

దీంతో ఆమె ఏడుపు విని పొరుగింటివారు వచ్చి గాలించినా వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్ ​కార్పొరేషన్​కమిషనర్ ​మంద మకరంద్​అక్కడికి వచ్చి ఫైర్ ​సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు కిలోమీటర్​ వరకూ వెతికినా జాడ దొరకలేదు. నీటి ప్రవాహం తగ్గాకే గల్లంతైన పాప జాడ తెలిసే అవకాశం ఉంది.