మోర్బి: గుజరాత్‌లోని నదిలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోగా, ఏడుగురు గల్లంతయ్యారు. మరో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మోర్బి జిల్లాలోని ధనవ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ధనవ గ్రామ సమీపంలోని ఓ నదిలో ట్రాక్టర్‌లో 17 మంది నది దాటుతుండగా, వరద ఉధృతికి ట్రాలీ కొట్టుకుపోయింది.
అందులో ఏడుగురు గల్లంతు కాగా, 10 మంది బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మరోవైపు, వల్సాద్, నవ్సారీ జిల్లాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ జిల్లాల్లోని నదులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో నది పరివాహాక ప్రాంతంలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గడిచిన 24 గంటల్లో నవ్సారీ జిల్లాలోని ఖేర్గం తాలుకాలో 35.6 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయింది. డాంగ్స్ జిల్లాలోని డాంగ్ అహ్వా తాలూకాలో 26.8 సెంటీమీటర్ల వర్షం పడింది.