తెలంగాణవ్యాప్తంగా వరదల్లో కొట్టుకుపోయి 18 మంది మృతి

  • మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు..
  • తండ్రీకూతురు మృతి, కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్​ అశ్విని
  • పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు.. కొడుకును కాపాడిన స్థానికులు
  • నారాయణపేట జిల్లాలో గోడ కూలి తల్లీబిడ్డ దుర్మరణం
  • ఘట్​కేసర్​లో కరెంట్ షాక్​తో ప్రిన్సిపాల్ కన్నుమూత

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం 18 మంది చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లాలో కారు గల్లంతు కాగా.. తండ్రీకూతుళ్లు చనిపోయారు. కూతురు అశ్వినీ మృతదేహం దొరకగా.. తండ్రి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అశ్వినీ.. చత్తీస్​గఢ్​లో సైంటిస్ట్​గా పని చేస్తున్నది. వీరు హైదరాబాద్​కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఇద్దరు వృద్ధులు వరదలో కొట్టుకుపోయారు. మణుగూరు మండలంలో ఓ దివ్యాంగుడు నీట మునిగి చనిపోయాడు. 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఓ యాచకురాలు వరదలో కొట్టుకుపోయి మృతి చెందింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గోడ కూలి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా మల్యాల సమీపంలో ఓ బిల్ కలెక్టర్ వాగు దాటుతూ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కరెంట్ షాక్​తో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణం 13 నెలల బాలుడు వర్షంలో ఆడుకుంటూ కిందపడి మృతి చెందాడు. అదే జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకతను, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒర్రెలో మునిగి ఒకరు, పిడుగు పడి మరొకరు చనిపోయారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కారు కొట్టుకుపోవడంతో ఒకరు, వాగులో మునిగి మరొకరు మృతి చెందారు.

వరదలో కొట్టుకుపోయిన వృద్ధులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కల్లూరి నీలమయ్య (60), తాటి ఆదెమ్మ (70) ఊరు బయట ఉన్న లోతువాగు ఒడ్డున పశువుల పాకలో పడుకున్నరు. శనివారం రాత్రి ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. గ్రామానికి కొద్ది దూరంలో ఇద్దరి డెడ్​బాడీలు దొరికాయి. 20 ఎడ్లు, 200 మేకలు కొట్టుకుపోయాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సుందరయ్యనగర్ లో నందికొల్ల రాము (30) అనే దివ్యాంగుడు వరద నీటిలో మునిగి చనిపోయాడు. అదేవిధంగా, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో మందపల్లికి చెందిన కొండ్రు సమ్మక్క అనే వృద్ధ యాచకురాలు వరద నీటిలో కొట్టుకుపోయింది. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నర్సయ్య (55) చేపల వేట కోసం వెళ్లి వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు.

ఆడుకుంటూ కిందపడి చనిపోయిన 13 నెలల బాలుడు

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మున్సిపాలిటీలోని విజ్ఞాన్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ (48) కరెంట్ షాక్​తో చనిపోయాడు. స్కూల్ బిల్డింగ్​పై నీరు చేరడంతో వాటిని ఇనుప రాడ్డుతో తొలగిస్తుండగా పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగిలాయి. దీంతో అతను స్పాట్​లోనే చనిపోయాడు. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

 కాగా, రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలోని నోబుల్ పార్క్ కాలనీలో మీర్ అహ్మద్, రోఫన్ దంపతుల 13 నెలల కొడుకు నీళ్లలో ఆడుకుంటూ కిందపడి చనిపోయాడు. వీళ్లది బీహార్ అని, పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ మండలం దేవునిపల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లి శేఖర్ (35) చనిపోయాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ (38) ఒర్రెలో మునిగి చనిపోయాడు. నార్లాపూర్ గ్రామానికి చెందిన పుట్ట మహేశ్ (25) పిడుగుపడటంతో మృతి చెందాడు. 

కోదాడలో ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలోని హుజూర్​నగర్​లో కారులో ప్రయాణిస్తూ నీటి ఉధృతికి రవి కుమార్ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. శ్రీమన్నారాయణ కాలనీ వరదలో ఎర్రమాల వెంకటేశ్వర్లు నీట మునిగి మృతి చెందాడు. కోదాడ పట్టణంలో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, బైక్​లు కొట్టుకుపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాళ్ల వాగు దాటే ప్రయత్నంలో ఓ డీసీఎం కొట్టుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు.

కూతురు మృతి.. తండ్రి గల్లంతు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన నూనావత్ మోతీలాల్, కూతురు నూనావత్ అశ్విని కారులో హైదరాబాద్​కు వెళ్తూ వరదలో కొట్టుకుపోయారు. మోతీలాల్ వృత్తిరీత్యా రైతు. ఆయన కూతురు అశ్వినీ.. అగ్రికల్చర్​లో పీహెచ్​డీ చేసింది. చత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్ట్​గా పని చేస్తున్నది. సోదరుడు ఎంగేజ్​మెంట్ ఉండటంతో మూడు రోజుల కింద గంగారం తండాకు వచ్చింది. తిరిగి చత్తీస్​గఢ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నది. కూతురు అశ్వినీని ఫ్లైట్ ఎక్కించేందుకు తండ్రి మోతీలాల్ తన కారులో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్దకు వచ్చారు. 

వాగులో కారు చిక్కుకుపోవడంతో నాలుగున్నర టైమ్​లో కొడుకు అశోక్​కు మోతీలాల్ ఫోన్ చేశాడు. ‘‘వరదలో చిక్కుకుపోయాం. నీటిలో మునిగిపోతున్నం’’అని చెప్పాడు. తర్వాత తండ్రికి ఫోన్ చేస్తే కలవలేదు. అధికారులు గాలింపు చేపట్టగా.. ఓ పామాయిల్ తోటలో అశ్విని (29 మృతదేహం దొరికింది. మోతీలాల్ డెడ్​బాడీ కోసం వెతుకుతున్నరు. 

పెద్దపల్లిలో బిల్ కలెక్టర్ గల్లంతు

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో గోడ కూలి తల్లీకూతురు చనిపోయారు. మాదిగ హన్మమ్మ, హనుమప్ప భార్యాభర్తలు. నాలుగేండ్ల కింద హనుమప్ప చనిపోయాడు. రెండో కూతురు అంజిలమ్మ భర్త కూడా ఇటీవల చనిపోగా, ఆమె కూడా తల్లి వద్దే ఉంటున్నది. ఆదివారం తెల్లవారుజామున పాత మిద్దె గోడ కూలిపోయింది. దీంతో హన్మమ్మ (60), అంజిలమ్మ (42) స్పాట్​లోనే చనిపోయారు. అదేవిధంగా, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్యాల పవన్ (23) మల్యాల సమీపంలో నక్కల వాగు దాటుతుండగా బైక్​తో సహా కొట్టుకుపోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడలోని హుజుర్​నగర్​లో స్కూటీపై రోడ్డు దాటుతుండగా వృద్ధుడు గల్లంతయ్యాడు. నాగర్​కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సావాడ వద్ద దుందుభి వాగు వరదలో చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు.

కొడుకు బతికాడు.. తల్లిదండ్రులు కొట్టుకుపోయారు

భారీ వర్షం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో విషాదం నింపింది. పాలేరు వాగు వరదలో చిక్కుకున్న కుటుంబంలో తల్లిదండ్రులు కొట్టుకుపోగా, కొడుకును స్థానికులు కాపాడారు. పాలేరు రిజర్వాయర్ కు ఆదివారం వరద పోటెత్తడంతో షేక్ యాకుబ్, ఆయన భార్య సైదాబి, కుమారుడు షరీఫ్ వరదలో చిక్కుకుపోయారు. స్థానికులు ఆ ముగ్గురిని కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వరద ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. వరద ప్రవాహంలో ముగ్గురు గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న షరీఫ్ ను పోలీసులు కాపాడారు. అతని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.