‘బాగున్నావా అమ్మా’..అంటూ గోల్డ్ చైన్ లాక్కొని పరార్

  • మాయమాటలతో  వృద్ధురాలిని మోసగించిన దొంగ
  • కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘటన

జమ్మికుంట, వెలుగు : వృద్ధురాలిని మాయమాటలతో నమ్మించి బంగారు గొలుసును దొంగ ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్‌‌ జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. జమ్మికుంట టౌన్ కు చెందిన వృద్ధురాలు సూదం చంద్రకళ(70) సోమవారం ఉదయం శివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు.‘బాగున్నావా.. అమ్మా.. పింఛన్ తీసుకున్నావా’ అంటూ పలకరించి ఆమెతో మాటలు కలిపాడు. ‘ పింఛన్ నా కొడుకులు తీసుకొస్తారు’.. అని వృద్ధురాలు బదులిచ్చింది.  

‘నీ కొడుకులు నాకు తెలుసు’ అంటూ.. పింఛన్ కోసం ఫొటో దిగాలని ఆమెకు మాయమాటలు చెప్పాడు. వృద్ధురాలిని సురక్ష ఆస్పత్రి సమీపంలోకి తీసుకెళ్లి దిమ్మెపై కూర్చొబెట్టాడు. ఫొటోలు దిగేటప్పుడు మెడలోని బంగారు గొలుసు ఉండొద్దని చెప్పి.. చైన్ తీసుకుని పరార్ అయ్యాడు. వృద్ధురాలు లబోదిబోమంటూ ఏడ్చుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. రెండున్నర తులాల గొలుసు విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుంది. బాధితురాలి ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.