డెంగ్యూతో పదేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూతో నాల్గవ తరగతి చదువుతున్న రావుల రిషిత(10) అనే బాలిక మృతి చెందింది. చికిత్స తీసుకుంటుండగానే చిన్నారి మరణించింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల వైరల్ ఫీవర్, డెంగ్యూ విష జ్వరాలు సోకుతున్నాయి. మిగతా జ్వరాలతో పోలిస్తే డెంగీలో మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. 

దానికి కారణం ప్లేట్‌‌లెట్లు. రక్తంలో రక్తకణాలతో పాటు ప్లేట్‌‌లెట్స్‌‌ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఇవి లేకపోతే శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. మామూలుగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సోకినప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది. 

ఒక్కోసారి డెంగీని గుర్తించే సరికే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ప్లేట్‌‌లెట్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. శరీరమే ఇమ్యూనిటీ సాయంతో ప్లేట్‌‌లెట్లను పెంచుకోవాలి. ప్లేట్‌‌లెట్ల సంఖ్య ఇరవై వేల కంటే తక్కువకి పడిపోతే డాక్టర్లు కొత్త ప్లేట్‌‌లెట్లను ఎక్కిస్తారు. అప్పటికీ శరీరం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది. వైరస్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంది? బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? అనేదాన్ని బట్టి ప్రమాదం స్థాయి మారుతుంటుంది. అలాగే డెంగీ వైరస్ దాడిచేసినప్పుడు రక్తనాళాల గోడలు డ్యామేజ్ అవుతాయి. దాంతో రక్తస్రావం అవుతుంది. దీనివల్ల కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. డెంగీ మరణాలకు ఇది కూడా ఒక కారణం.

Also Read : బస్సు టైర్ పేలి.. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

డెంగీని గుర్తించడం లేట్ అయ్యే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. కొంత మందిలో డెంగీ వైరస్‌‌ సోకిన వారం రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొన్నిసార్లు నార్మల్ ఫీవర్‌‌‌‌లా వచ్చి తగ్గిపోతుంది. మరికొన్నిసార్లు జ్వరం రాకుండా ఒళ్లు నొప్పులు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రక్త పరీక్ష చేయించకపోతే వచ్చింది డెంగీ అన్న సంగతి తెలియదు. అలా కొంత నష్టం జరుగుతుంది. అందుకే వచ్చింది డెంగీనో, కాదో తెలియాలంటే ఈ సీజన్‌‌లో శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో గమనిస్తుండాలి.  కాస్త నలతగా అనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. జ్వరం వచ్చి, తగ్గాక కూడా మరోసారి రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది.