షార్ట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌తో ఇంటికి నిప్పు ఏడేండ్ల బాలుడు సజీవ దహనం

మానకొండూర్, వెలుగు : షార్ట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ కారణంగా ఇంటికి మంటలు అంటుకోవడంతో ఏడేండ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన అంగిడి అనిత, -రాజు దంపతులకు కుమారుడు సాయి కుమార్ (7), కుమార్తె రితిక ఉన్నారు. రాజు ఆటో నడుపుతుండగా, అనిత కూలీ పని చేస్తోంది. దీంతో పాటు ధాన్యంపై కప్పే పరదాలు కూడా అమ్ముతుంటారు. 

శుక్రవారం సాయంత్రం అనిత, రాజు, రితిక బయటకు వెళ్లగా సాయికుమార్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో పడుకున్నాడు. ఈ టైంలో షార్ట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ కారణంగా మంటలు లేచి ఇంట్లో ఉన్న వస్తువులు, పరదాలకు అంటుకున్నాయి. సాయికుమార్‌‌‌‌‌‌‌‌ నిద్రలేచి చూసేసరికే మంటలు చుట్టుముట్టాయి. బయటకు వెళ్లిన అనిత ఇంటి వచ్చే సరికి మంటలు ఎగిసిపడుతుండడంతో ఫైర్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

వారు వచ్చి మంటలు ఆర్పేసరికే సాయికుమార్‌‌‌‌‌‌‌‌ సజీవ దహనం కాగా, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కాలిపోయాయి. సాయికుమార్‌‌‌‌‌‌‌‌ కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో యూకేజీ చదువుతున్నాడు.