మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..బాధితులకు ప్రత్యామ్నాయం చూపించి ముందుకెళ్లాలి

  • సీపీఐ సెమినార్​లో మేధావులు, వక్తలు
  • నిర్వాసితులతో చర్చించి, సమగ్ర పునరావాసం కల్పించాలని వ్యాఖ్య

 హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని పలువురు మేధావులు, సామాజికవేత్తలు, సీపీఐ నాయకులు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ, ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రక్షాళన అంటే కేవలం ఇండ్లను కూలగొట్టడమే కాదని గ్రహించి, బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాకే పనులు మొదలు పెట్టాలని సూచించారు. బషీర్​బాగ్​లోని  దేశోద్ధారక భవన్ లో గురువారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘హైడ్రా కార్యకలాపాలు.. మూసీ నది ప్రక్షాళన.. పేద, మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అంశంపై సెమినార్ నిర్వహించారు.  

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్​లో పలువురు మేధావులు, నేతలు పాల్గొని మాట్లాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని.. కానీ, ఆ ప్రక్రియలో ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామన్నారు. ప్రొఫెసర్ ​కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిందేనని.. అయితే, ముందు పేదలు, మధ్యతరగతి బాధిత ప్రజలను ఒప్పించి, మెప్పించాలన్నారు.

ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి పోరాటం చేసి.. హైదరాబాద్​లో వేలాది మంది పేదలకు గుడిసెలు వేయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రొఫెసర్లు​హరగోపాల్, నాగేశ్వర్,​ ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్​ కె శ్రీనివాస్, మాట్లాడుతూ.. జీవించడానికి చేసే ఆక్రమణ నేరం కాదని స్పష్టం చేశారు. కానీ, ప్రభుత్వం ఎవరూ అడ్డం వచ్చినా వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తామనే ధోరణిలో వెళ్లడం సరైంది కాదన్నారు. బాధితులకు పట్టాలు లేకుంటే, అర్హత లేనట్టా అని ప్రశ్నించారు. మూసీ పరిధిలో ఇండ్లు కట్టుకున్న ప్రతిఒక్కరిని హక్కుదారులుగా గుర్తించాలన్నారు. 

సలహాలు, సూచనలతో  త్వరలో ప్రభుత్వానికి లేఖ..

మూసీ, హైడ్రా బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్న తర్వాతే ఏ చర్యలైనా తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన పలు ప్రతిపాదనలను సీపీఐ ఇప్పటికే సిద్దం చేసిందని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. వక్తలు, బాధితుల అభిప్రాయాలను క్రోడికరించి సమగ్రమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి.. సీపీఐ నాయకులు, మేధావులతో కూడిన ప్రతినిధి బృందం సీఎం రేవంర్​ను కలిసి అందజేయనున్నట్టు తెలిపారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఎన్. బాలమల్లేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్, ఈటి నరసింహా  పాల్గొన్నారు.