‘స్వచ్ఛదనం-పచ్చదనం’  పక్కాగా చేపట్టాలి 

  • ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్​ఖాన్​
  • కార్యక్రమం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం 
  • ‘దళితబంధు’ అమలుపై సమీక్ష 
  • తల్లిపాల వారోత్సవాల  ర్యాలీ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించే ‘స్వచ్ఛదనం–పచ్చదనం’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో కార్యక్రమ నిర్వహణపై  రివ్యూ చేశారు. ప్రతి ఇంటిలోనూ, కాలనీల్లోనూ మొక్కలు నాటాలని సూచించారు. 5న స్థానిక నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, వార్డు కమిటీలతో సమావేశం, ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇళ్లలో సేకరించిన తడి, పొడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయాలని చెప్పారు. వీధులు, నివాస ప్రాంతాలు, ప్రజాసంస్థలు, పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాలు, బస్ స్టాప్ లు  శుభ్రపర్చాలన్నారు.

ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. 6న తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. 7న కాల్వల, నీరు నిల్వల ప్రాంతాల్లో గుంతలు పూడ్చాలన్నారు.  8న ఆరోగ్యం, వీధి కుక్కల సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల,ఆశా, పాఠశాల సమావేశాల్లో డెంగ్యూ, మలేరియాపై ప్రచారం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డుల్లో జ్వర సర్వే చేయాలన్నారు.

దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ సిద్ధం చేయాలని చెప్పారు. పట్టణాల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీధికుక్కలకు స్టెరీలైజేషన్, టీకాలు వేయించాలని సూచించారు. శిథిలమైన భవనాలు, గోడలు, ఎండిపోయిన  ప్రమాదకర చెట్లను తొలగించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో వనమహోత్సవం కింద మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం 6 మొక్కలు పంపిణీ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీసీఈవో ఎస్. వినోద్, డీపీవో హరికిషన్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

‘దళిత బంధు’తో లబ్ధి చేకూరాలి

దళితబంధుతో లబ్ధిదారులకు పూర్తి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో దళితబంధుపై చింతకాని మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. స్కీం అమలుపై సమీక్షించారు. చింతకాని మండలంలో 25 గ్రామాల నుంచి 3,462 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళితబంధు పథకం కింద వివిధ రకాల యూనిట్లను మంజూరు చేసి, గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. యూనిట్, యూనిట్ ధర తదితర అంశాలతో గ్రామాల వారీగా నివేదిక సమర్పించాలని అధికారులకు 
సూచించారు.  

ఆర్మీ ట్రైనింగ్ స్థలం కేటాయింపుపై చర్చ 

ఆర్మీ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు రఘునాథపాలెంలో కేటాయించిన స్థలం విషయమై ఆర్మీ అధికారులు కల్నల్ ఎస్​కే భద్ర, కమాండింగ్ అధికారి ఎన్​సీసీ బెటాలియన్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితీశ్ ఠాకూర్, సీఆర్పీఎఫ్ లెఫ్టినెంట్ కల్నల్ నవీన్ యాదవ్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో చర్చించారు. ఆర్మీ శిక్షణా కేంద్రానికి కేటాయించిన 1.23 ఎకరాల స్థలాన్ని అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వెళ్లే దారిలోని ఎన్​సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని పాత సబ్ జైలుకు మార్చాలని కోరారు. దీనికి కలెక్టర్​ జైళ్ల శాఖ డీజీని సంప్రదించి చర్యలు చేపట్టనున్నట్లు 
తెలిపారు. 

తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టం

తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరమని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా  శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని పెవిలియన్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తల్లి పాల ప్రాముఖ్యతను తెలుపుతూ నినాదాలు, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలతో ర్యాలీని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ప్రసవించిన అర గంట లోపు బిడ్డకు తల్లి ముర్రు పాలు పట్టించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా ప్రచారం చేపట్టాలని సూచించారు.