కేంద్రం లోన్స్ ఇమ్మంటే మీరు చేసేది ఇదా?..అధికారుల నిర్లక్ష్యంపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఫైర్

  •     పీఎం విశ్వ కర్మ, ఎడ్యుకేషన్, ముద్ర లోన్స్ తగ్గడంపై అసహనం
  •     టాయిలెట్స్​ మెయింటెనెన్స్​లేకపోవడంపై మండిపాటు
  •     బేగంపేట హరిత ప్లాజాలో దిశ మీటింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘గతేడాది రూ.1,203 కోట్ల పీఎం ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలని టార్గెట్​పెట్టుకుంటే రూ. 131 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇదొక్కటే కాదు పీఎం విశ్వకర్మ, ముద్ర లోన్స్​విషయంలోనూ ఇలాగే జరుగుతోంది’ అంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్​జిల్లా అధికారులపై మండిపడ్డారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం డెవలప్​మెంట్​కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. 

దిశ కమిటీ చైర్మన్ హోదాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మీటింగ్​ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. స్వచ్ఛ భారత్ మిషన్, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ముద్ర లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఎంఎస్ఎంఈలపై సమీక్షించారు. సిటీలో రైల్వేస్, ఎలక్ట్రిసిటీ, నేషనల్ హైవేస్, హెల్త్, ఎడ్యుకేషన్, పోస్టల్, బ్రిడ్జిల నిర్మాణంతో పాటు 24 డిపార్ట్​మెంట్లకు సంబంధించిన విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

18 వేల అప్లికేషన్లకు 620 మందికి ఇస్తరా? 

ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో స్టూడెంట్స్ లోన్ల కోసం అప్లై చేసుకుంటున్నా ఏదో కారణం చెప్తూ రిజెక్ట్ చేస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. విశ్వకర్మ పథకానికి 18వేల అప్లికేషన్లు వస్తే కేవలం 620 మందికి మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 45 రోజుల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేయకపోతే అధికారులపై యాక్షన్ తప్పదని హెచ్చరించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, సబ్సిడీ లోన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. వచ్చే సమావేశంలో ఆయా విషయాలపై పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్​అందజేయాలని ఆదేశించారు. 

ముద్ర లోన్స్ విషయంలో అధికారులు టార్గెట్ రీచ్ కావట్లేదన్నారు. ఏ బ్యాంకు ఎన్ని ముద్ర రుణాలు అందజేసిందనే రిపోర్టును ఇవ్వాలన్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ డీసీసీ మీటింగ్ కు కూడా  బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరుకారని, కిందిస్థాయి ఉద్యోగులను పంపుతున్నారని బ్యాంకు ఆఫీసర్లపై మండిపడ్డారు. 

టాయిలెట్స్​ విషయంలోనూ అంతేనా..

స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్ మెయింటనెన్స్​పై బల్దియా దృష్టిపెట్టకపోవడంపై కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టాయిలెట్స్ లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. సిటీలో 2,251 టాయిలెట్స్ ఉన్నాయని, వాటి క్లీనింగ్, మెయింటనెన్స్​ను పట్టించుకోవాలన్నారు. స్ట్రీట్ లైట్స్ వెలిగే పరిస్థితి లేదని, తాను బస్తీలకు వెళ్లినప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదని ప్రజలు చెప్పారన్నారు. కమ్యూనిటీ హాల్స్​లభించకపోవడంతో 14 ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయలేకపోయామని హైదరాబాద్ వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ అర్హుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

బిల్లు కట్టకపోతే డెడ్​బాడీలు ఇవ్వరా? 

ప్రైవేటు హాస్పిటల్స్ లో బిల్లుల చెల్లించలేదనే కారణంతో డెడ్​బాడీలను కుటుంబాలకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఘటనలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ఐఏఎస్ ఆఫీసర్లందరూ టీబీ పేషెంట్లను అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. అడాప్ట్ చేసేకున్న టీబీ రోగుల వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు. 

హైటెక్ సిటీ ఒక్కటే లేదు కదా!   

మైనారిటీలకు కేంద్రం రెసిడెన్షియల్ స్కూల్స్,హాస్టళ్లు మంజూరు చేస్తే హైదరాబాద్​లో బిల్డింగులు కూడా పూర్తి చేయలేదన్నారు.  మైనార్టీ వెల్ఫేర్​ఆఫీసర్​పై మండిపడ్డారు. శాంక్షన్​ అయిన నిధులను పయోగించుకోలేకపోతున్నారన్నారు. అంగన్ వాడీ స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత ఉందన్నారు. దిశా కమిటీ మీటింగులో అనేక విషయాలపై చర్చించడం జరిగిందని, ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా రివ్యూ చేసుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో 80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తున్నదని, అయినా, బల్దియా మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైటెక్​సిటీని మాత్రమే కాదని, ఇతర ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్ మూతబడే పరిస్థితిలో ఉందన్నారు. చర్చించిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకొని పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఎంపీ ఈటల రాజేందర్,  వివిధ శాఖల అధికారులు, దిశ క‌‌‌‌మిటీ మెంబ‌‌‌‌ర్స్ పాల్గొన్నారు.