అమెరికాలో వెదర్ ఎమర్జెన్సీ.. మంచు తుఫానుతో గడ్డకట్టిపోతున్న జనం

వాషింగ్టన్: అమెరికా దేశాన్ని మంచు తుఫాను వణికిస్తోంది. మంచు తుఫాను కారణంగా అమెరికాలో 60 మిలియన్ల మంది గజగజ వణికిపోతున్నారు. 2,200 విమానాలను రద్దు చేశారు. 25,000 విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కెంటకీ గవర్నర్ ఆండీ బెసీర్ సూచించారు. మంచు తుఫాను కారణంగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హిమంతో కూడిన వర్షం అమెరికాలోని చాలా ప్రాంతాలను కప్పేసింది. హైవేలన్నీ మంచుతో నండిపోవడంతో ఆ మంచును తొలగించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. 

అమెరికాలో కన్సస్లో అయితే 30 అడుగుల మేర రోడ్లను మంచు కప్పేసింది. ఉత్తర అమెరికాలోని కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కన్సాస్, అర్కన్సస్, మిస్సోరీ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. రోడ్ల మీద నిలిపి ఉన్న కార్లు మంచులో కూరుకుపోయాయి. మంచు కారణంగా రోడ్ల మీద ప్రయాణాలు కష్టతరంగా మారాయి. ఈ మంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. లూయిస్ వ్యాలీ, కెంటకీలో 7.7 అంగుళాల మంచు కురిసింది. ఈ స్థాయిలో మంచు కురిసి వందేళ్ల రికార్డును చెరిపేసింది. లెక్సింగ్ టన్ ప్రాంతంలో కూడా 5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది. 

కన్సాస్, మిస్సోరీలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని, మంచు తుఫాను విజృంభించబోతుందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 45 ఎంపీహెచ్ స్పీడ్తో మంచుతో కూడిన చలిగాలులు వణికించబోతున్నాయని అధికారులు ప్రకటించారు. మిన్నెసోటా ప్రాంతంలో -11 డిగ్రీ ఫారన్ హీట్ ఉష్ణోగ్రత నమోదయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పు అమెరికా కూడా మంచు తుఫాను కారణంగా ప్రజలు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్జీనియా, కన్సాస్, మేరీల్యాండ్ గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులిచ్చేశారు. మిస్సిసిపీ, లూసియానా, అర్కన్సాస్ ప్రాంతాల్లో టోర్నడో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.