బంగ్లాదేశ్ లో హిందువుల భారీ ర్యాలీ : మైనార్టీల రక్షణ కోసం నిరసన

చిట్టగాంగ్:  బంగ్లాదేశ్ లో కొన్నాళ్లుగా మైనారిటీలపై  జరిగిన దాడులు, అత్యాచారాలపై విచారణకు వెంటనే ట్రిబ్యునల్  ఏర్పాటు చేయాలని అక్కడి హిందువులు డిమాండ్  చేశారు. మైనారిటీలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, దాడుల్లో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరారు. సనాతన్  జాగరణ్​ మంచ్  ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టగాంగ్ లో ఈ మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం లాల్ దిఘి మైదాన్ లో సమావేశమయ్యారు.

 ముహమ్మద్  యూనుస్  నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తూనే ఉంటామన్నారు. ‘‘మైనారిటీల రక్షణకు వెంటనే చట్టం చేయాలి. మైనారిటీ శాఖను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనారిటీ ప్రార్థనా మందిరాలు నిర్మించాలి. ‘ప్రాపర్టీ రికవరీ యాక్ట్, ప్రిజర్వేషన్  యాక్ట్  వంటి చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. సంస్కృతం, పాళీ విద్యా బోర్డును ఆధునీకరించాలి. దుర్గా పూజకు 5 రోజుల సెలవులు ఇవ్వాలి” అని సనాతన్  జాగరణ్​ మంచ్  నేతలు డిమాండ్  చేశారు.