జపాన్‎లో భారీ భూకంపం.. 370 మంది చనిపోయిన ప్రాంతంలోనే మరోసారి

టోక్యో: జపాన్‌లో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ (6.2 మైళ్లు) లోతులో 2024, నవంబర్ 26వ తేదీ అర్థరాత్రి భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. 8 కిమీ లోతులో ఈ భూ కంపం కేంద్రీకృతమైంది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‎పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. జపాన్ మీడియా కథనాల ప్రకారం.. నోటో ద్వీపకల్పంలోన సంభవించిన భ కంపం వల్ల ఉత్తర తీరంలో ఉన్న అణు విద్యుత్ ప్లాంట్‌లో మంగళవారం ఎటువంటి అసాధారణతలు కనిపించలేదని తెలిపాయి.

షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని రెండు నిష్క్రియ రియాక్టర్‌లు భూ ప్రకంపనల వల్ల చిన్నపాటి నష్టాన్ని చవిచూశాయని.. అయితే రేడియేషన్ లీక్ జరగలేదని వెల్లడించాయి. ఈ ఏడాది (2024) ప్రారంభంలో కూడా ఇదే నోటో ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విషాదంలో దాదాపు 370 మందికి పైగా మరణించగా.. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టం నుండి ఇప్పుడిప్పుడే నోటో ప్రాంతం కోలుకుంటుండగా.. అదే ప్రాంతంలో మరోసారి భూ కంపం సంభవించడంతో స్థానికులు భయందోళనకు గురి అవుతున్నారు.