యాదాద్రి జిల్లాలో బిహార్​ వ్యక్తి హత్య

  • భువనగిరిలో లారీ మెకానిక్ గా పని చేస్తున్న మృతుడు
  • డెడ్ బాడీపై తీవ్రగాయాలు..మర్డర్ గా కేసు నమోదు

యాదాద్రి, వెలుగు : బిహార్​కు చెందిన వ్యక్తి యాదాద్రి జిల్లాలో హత్యకు గురయ్యాడు. భువనగిరి టౌన్​ఎస్ఐ కుమారస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్​లోని సీతామర్హి జిల్లా బహిరి గ్రామానికి చెందిన ఎండీ శంషే ఆలం(22) భువనగిరిలోని లారీ మెకానిక్ కరీముల్లా వద్ద పని చేస్తున్నాడు. అక్కడే పనిచేసే తన గ్రామానికి చెందిన జమీల్​ అక్తర్​తో కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి షంశే ఆలం రూమ్ లో ఎవరికి చెప్పకుండా బయటకు  వెళ్లిపోయాడు. నల్గొండ రోడ్​కు కొద్ది దూరంలో యువకుడి డెడ్ బాడీ ఉందని మిర్చీ వ్యాపారి షేక్​మీరావలి పోలీసులకు సమాచారం అందించాడు. 

తోటి మెకానిక్​జమీల్​అక్తర్​అక్కడికి వెళ్లి చూసి చనిపోయిన వ్యక్తి తమతో పాటు ఉండే షంశే ఆలంగా గుర్తించాడు. పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడి తల, నుదురు, కనుబొమ్మలపై ఇనుప రాడ్​తీవ్రంగా కొట్టినట్టుగా గాయాలు కన్పించాయి. దీంతో ఆలంను హత్య చేసి డెడ్ బాడీని పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడితో పాటు పని చేసే వ్యక్తులను పిలిచి విచారిస్తున్నారు. బిహార్​లోని మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు.