మగాళ్లు ఏం పాపం చేశారు : ఆ ఊర్లోకి మగవాళ్లకి నో ఎంట్రీ..!

అది ఆడవాళ్లకోసం స్పెషల్ గా  కట్టుకున్న ఊరు. ఆ ఊర్లోకి మగవారు వెళ్లాలనుకుంటే అంతే సంగతులు. ఎందుకంటే అక్కడ ఉండేది మొత్తం మహిళలే. తమ ఊరిలోకి మగవారిని రానివ్వమని షరతు విధించుకొని మరీ పాటిస్తున్నారు. ఇంతకీ అలా షరతు పెట్టించుకొని మగవాళ్లకి 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారు. అసలు అక్కడ ఏమి జరిగింది?

అది కెన్యాలోని ఓ గ్రామం. పేరు ఉమోజా. 25 ఏళ్ల క్రితం రెబెకా అనే ఓ మహిళ కేవలం ఆడవాళ్ల కోసం మాత్రమే ఈ ఊరు ఏర్పాటు చేసింది. ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ ఊరు ఎందుకు ఏర్పాటు చేశారు, అందులోకి మగవారు రావడానికి ఎందుకు నిరాకరించారు అని అడిగితే.. ఆ గ్రామ పెద్ద రెబెకా పెద్ద కథ చెప్పంది. గతంలో ఈ ప్రాంతంలో బ్రిటీష్ సైనికులు ట్రైనింగ్ పొందేవారట. ఆ సమయంలో కుటుంబాలకు, భార్యాపిల్లలకు మగవాళ్లు దూరంగా ఉండడం వల్ల అక్కడ నివసించే మహిళల మీద అత్యాచారాలకు పాల్చాడేవారు. ఒకవేళ ఎవరైనా నిరాకరించినా, తిరగబడినా విపరీతంగా, రక్తం కారేలా కొట్టి హింసించేవారట. మేకలను మేపడానికి ఓ యువతి అడవికి వెళ్తే ఆమెను కొంతమంది అత్యాచారం చేసి తీవ్రంగా హింసించారు. ఒళ్లంతా గాయాలతో ఇంటికి చేరుకున్న ఆమెను భర్త ఊరడించకపోగా.. ఒళ్లంతా కందిపోయేలా కొట్టాడు. ఆమె భయంతో ఇల్లు వదిలి పారిపోయింది. ఇలాంటి ఘటనలు నిత్యం గమనిస్తున్న రెబెకా పురుషులే లేకుండా ఒక ఊరు కట్టుకుందామని ప్రతిపాదన పెట్టి 16 మంది మహిళలతో ఉమోజా ఊరును తయారు చేసింది. 1990లో ఉమోజా ఊరు నిర్మాణం మొదలు పెట్టారు. ఎన్నోసార్లు పురుషులు ఈ ఊరు మీద దాడి చేసి ఊరు. లేకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ.. ఆ ఊరి మహిళలంతా ధైర్యంగా పోరాడి ఊరును కాపాడుకున్నారు. 

గృహహింస తట్టుకోలేక భర్తను వదిలేసిన వారికి ఉమోజా ఒక హోమ్ లాంటిది. అత్యాచార బాధిత మహిళలకు ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకుంటుంది. భర్త చనిపోయి ఒంటరిగా ఉండలేని వితంతువులు ఉమోజాను తమ చిరునామాగా మార్చుకుంటారు. కొంతమంది ఒంటరిగా వచ్చేస్తే..కొంతమంది పిల్లాపాపలతో కలిసి వస్తారు. అలా వచ్చిన వారందరికీ ఉమోజా ఆశ్రయమిస్తుంది. ఇలా ఒక్కొక్కరుగా ఆ ఊరికి రావడం మొదలై.. క్రమంగా ఊరు పెద్దదయింది. 'ఇక్కడ మగవారికి ప్రవేశం లేదు" అనే నిబంధన కఠినంగా అమలుపరుస్తున్నారు. ఈ ఊరిలో చూద్దామన్నా కూడా ఒక్క మగవాడు కనిపించడు. వేధింపులు, అత్యాచారాలు లేకుండా లేడీసికి ఈ ఊరు ఒక సురక్షిత చిరునామాగా చెప్పవచ్చు. 

ఉండడానికి ఒక ఊరైతే ఉంది. కానీ.. బతుకు దెరువు ఎట్ల? ఈ ఆలోచనే వారిని వ్యవసాయం, నగల తయారీ వంటి పనులు వైపు మళ్లించింది. వారికి కావాల్సిన అన్ని అవసరాలను వారే సమకూర్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో పురుషుల సాయం తీసుకోరు, ఇల్లు కట్టుకోవడం, తిండి, వేట, రక్షణ అన్నీ మహిళలే చూసుకుంటారు. పిల్లలను చదివించడానికి స్వయంగా స్కూల్ కట్టుకున్నారు. కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అక్కడ కలుసుకొని పరిష్కరించుకుంటారు. వీరు తయారుచేసే నగలు పూసలు, గింజలతో.. ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఊరిని చూడడానికి, వారు తయారుచేసే నగలు కొనడానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు. వారు సంపాదించిన ఆదాయం నుంచి పదిశాతం గ్రామ అభివృద్ధికి చెల్లిస్తారు. అయితే.. తమ ఊరిలోకి రావాలంటే మాత్రం వారు పెట్టిన రూల్పుకు ఒప్పుకోవాలి. అవి అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడిప్పుడే టూరిస్ట్ ప్లేస్ గా ఉమెజా అభివృద్ధి చెందుతోంది.