విశ్వాసం : తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి

అనగనగా మిథిలా నగరం. ఆ నగరానికి మహారాజు జనకుడు. ఆయన దగ్గర ఆత్మ తత్త్వం.. అంటే వేదాంతం తెలుసుకోవడానికి వ్యాస మహర్షి తన కుమారుడైన శుకుల వారిని పంపించాడు. ఈ శుకుడు జన్మతః విరాగి. శుకుడు వచ్చి జనకుడి తలుపు తట్టాడు. ‘‘ఎవరు వారు?’’ అన్నాడు జనకుడు.‘‘నేను’’ అన్నాడు శుకుడు.తలుపు తియ్యలేదు జనకుడు. శుకుడు మళ్లీ తలుపు తట్టాడు. అదే ప్రశ్న వేశారాయన. సమాధానమూ మార్చలేదు శుకుడు. తలుపులు మూసుకునే ఉన్నాయి. మూడో మారు తట్టేసరికి జనకుడు మళ్లీ ప్రశ్నించాడు.‘‘ఎవరు వారు’’‘‘అది తెలుసుకునేందుకే వచ్చాను’’ అన్నాడు శుకుడు.

అంటే..

ఆత్మతత్త్వం గ్రహించడానికి వచ్చానన్నాడు. జనకుడు తలుపు తెరిచాడు. శుకుడు లోపలకు నడిచాడు. సుఖాసీనుడవుతూనే ‘‘సామాన్య గృహస్థులే సంసార జంజాటంలో పడి కొట్టుకుంటున్నారే... ఉత్తి సంసారానికి తోడు ఇంత రాజ్యాన్ని పాలించే నీకు వైరాగ్యమేమిటి’’ అని ప్రశ్నించాడు శుకుడు. జనకుడు నవ్వాడు. 

జనకుడు అంతఃపురానికి వెళ్లి, పరిచారకుడిని పిలిచి, ఒక మూకుడు నిండా ఆముదం పోసి, జ్యోతి వెలిగించి, అది ఆరిపోకుండా నగరంలో ఉత్సవంతో తిరిగి రమ్మన్నాడు. మర్నాడు అతడిని పిలిచి, ఉత్సవ వివరాలు అడిగాడు. దానికి సమాధానంగా ‘‘అతడు, నాకేం తెలియదు మహారాజా, నేను జ్యోతి.. వెలుగుతున్నదో? లేదో? ఆముదం కదలకుండా ఉన్నదో? లేదో? చూసుకుంటున్నాను’’ అన్నాడు. జనకుడి మనస్సు ఆత్మ మీదనే లగ్నమై ఉందని చెప్పడానికి ఈ కథను మహాభారతం చెబుతోందని ఉషశ్రీ తన ‘పెళ్లాడే బొమ్మా’ అనే నవలా లేఖావళిలో వివరించారు. 


-(1961, ఆగస్టు 26, కృష్ణాపత్రికలో ప్రచురితమైన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళి నుంచి)-


జనకుడు మిథిలా నగరానికి రాజు కనుక తన ప్రజలను కన్నబిడ్డలుగా పాలించడానికి అనువుగా ఉండేవాడే కాని, రాజభోగాల మీద కాని, రాజ సంపదల మీద కాని లేశమాత్రమైనా దృష్టి లేనివాడు. ఒక రాజుగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, తన మనసును మాత్రం ఆత్మ మీదనే లగ్నం చేసుకుని, తత్త్వమార్గాన్ని అనుసరించాడు. రాజుగా సర్వాధికారాలు ఉంటాయి జనకుడికి. సంపదలను దారి మళ్లించగలడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోగలడు. కాని జనకుడు, ‘నేను ప్రజలకు పరిపాలకుడిగా నియమింపబడ్డాను. ఆ అధికారంలో ఉన్నంతవరకు ప్రజలకు మేలుచేయగలగాలి. నా ఆత్మతత్త్వాన్ని విడిచిపెట్టకూడదు’ అని నిశ్చయించుకున్నాడు. 

కనుకనే సాక్షాత్తు వేదవ్యాసుడు... జ్ఞాన సముపార్జన కోసం తన కుమారుడైన శుకుడిని జనకుడి దగ్గరకు పంపాడు. కొలనులో నడయాడే హంసలకు ఒక మంచి లక్షణం ఉంది. హంసలు తామరతూడులోని పాలను ఆహారంగా తీసుకుంటాయి. వాస్తవనానికి తామరతూడులు నీటిలో మునిగి ఉంటాయి. అంటే, దాని కాడ కొరికితే, ఆ పాలతో పాటు నీరు కూడా కడుపులోకి వెళ్తుంది. కాని హంసలు మాత్రం కేవలం తామరతూడులోని పాలను మాత్రమే స్వీకరించి, నీరు రాకుండా జాగ్రత్త వహిస్తాయి. జనకుడి తత్త్వం కూడా అదే.


జనకుని కొలువులో పని చేస్తున్న పరిచారకుడు సైతం తన పనిమీదనే దృష్టిని కేంద్రీకరించాడు. ఆ ఉత్సవంలో కన్ను చెదిరే సంపదలతో పాటు, ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ, అతడి దృష్టి మాత్రం తనకు కేటాయించిన పని మీద మాత్రమే నిలిపాడు. ఇక్కడ జనకుని వేదాంత ధోరణితో పాటు, ‘యథా రాజా తథా ప్రజా’ అనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కూడా కనిపిస్తుంది.


ఒక కుటుంబంలోని వారంతా సర్వసాధారణంగా ఆ కుటుంబ పెద్ద చేసే పనులను అనుసరించే గుణం కలిగి ఉంటారు. కుటుంబ పెద్ద అసత్యం పలికితే, మిగిలినవారు కూడా ఆ అసత్యాన్నే అనుసరిస్తారు. కుటుంబ పెద్ద అధర్మం చేస్తుంటే, వారు కూడా అధర్మం పట్లే సుముఖత చూపుతారు. అందుకే ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత వాడుకలోకి వచ్చింది. 

ఈ రోజుల్లో పరిశీలిస్తే...

అందరూ సెల్‌‌ ఫోన్లు, టీవీ సీరియల్స్‌‌కి బానిసలైపోయారు. పెద్దవారంతా టీవీ చూస్తూ, పిలల్ని చదువుకోమని ఆదేశిస్తే.. వారి మనసు చదువు మీదకు పోనే పోదు. పెద్దలే టీవీ కట్టేసి, ఒక పుస్తకం చేతిలోకి తీసుకుంటే, పిల్లలు కూడా చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. మనిషి జీవితం నీటి బుడగ వంటిది. అందుకే ఉన్నన్ని రోజులు తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎన్ని నీటి బిందువులు తామరాకు మీద పడినా, ఆకు ఏ మాత్రం తడిగా ఉండదు. ఆ ఆకు మీద నీటి బొట్టు కొద్దిసేపు నడయాడి, మళ్లీ కిందకి జారిపోతాయి. మనం ఆ విధంగా జీవించాలని జనకుడు మనకు చెబుతున్నాడు.

- డా. పురాణపండ వైజయంతి-