నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల శ్రీ మార్ట్ లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.  

అప్పటికే శ్రీమార్ట్ లోని ముందు భాగం మొత్తం సామగ్రి కాలి బూడిదైంది.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సూపర్ మార్కెట్ యజమాని ఫిర్యాదు మేరకు ఘటనపై పంచనామా నిర్వహించినట్లు ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు.