కాకతీయ కెనాల్ లోకి దూసుకెళ్లిన క్రేన్

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కెనాల్ కాకతీయ కెనాల్ లో ఆదివారం అదుపుతప్పి భారీ క్రెయిన్ దూసుకెళ్లింది. ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతుల కోసం వాడుతున్న భారీ క్రెయిన్ కిందకు వస్తున్న క్రమంలో దిగువనున్న కాకతీయ కాలువలోకి ఒక్కసారిగా అదుపుతప్పి నీట మునిగింది. అప్రమత్తమైన క్రేన్ ఆపరేటర్ బయటికి దూకడంతో ప్రాణాపాయం తప్పింది.  కెనాల్ లో మునిగిన క్రేన్ ను మరో క్రేన్ సాయంతో బయటికి తీశారు.

గతంలో ఇదే ప్రదేశంలో కారు దూసుకెళ్లి ఒరిస్సా కు చెందిన వారితో పాటు బాల్కొండ కు చెందిన తండ్రీ, కూతురు నీటిలో మునిగి మృతి చెందారు. ప్రాజెక్టు పై నుంచి వచ్చే వెహికిల్స్ ఏమాత్రం అప్రమత్తం లేకపోయినా కింద ఉన్న కెనాల్ లో మునిగిపోవాల్సిందే. కెనాల్ కు సైడ్ వాల్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లు కెనాల్ కు ఇరువైపులా గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.