మెక్సికో బార్‌‌లో కాల్పులు.. 10 మంది మృతి

మెక్సికో సిటీ: మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికన్ సిటీలోని క్వెరెటారోలో గల బార్​లోకి కొందరు దుండగులు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది చనిపోయారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు భారీ ఆయుధాలతో ట్రక్కులో వచ్చి కాల్పులు జరిపినట్టు క్వెరెటారో అధికారులు తెలిపారు. వెంటనే పోలీసులు స్పాట్​కు చేరుకొని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వాళ్లు  పరారయ్యారు. 

అయితే, దుండగులు ఎందుకు దాడి జరిపారన్నది ఇంకా తెలియరాలేదు. క్వెరెటారో మెక్సికోలోని సురక్షితమైన నగరాలలో ఒకటి. కానీ, ఇటీవలి కాలంలో అక్కడ తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలకు సంబందించినవే జరుగుతున్నాయి. 2006 నుంచి నాలుగు లక్షల యాభై వేల కంటే ఎక్కువ మంది హత్యకు గురయ్యారు.