ఇండియాలో 50శాతం యువత ఫిజికల్లీ అన్ ఫిట్

న్యూఢిల్లీ: మన దేశ యువత తగినంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం లేదని గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ స్టడీలో తేలింది. 2022లో దాదాపు 50 శాతం మంది యువత ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉన్నారని వెల్లడైంది. వీరిలో 57 శాతం మంది మహిళలు ఉండగా, 42 శాతం మంది మగవాళ్లు ఉన్నారని తేలింది. యువత వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) సూచించింది.

అంతకంటే తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, దాన్ని ఫిజికల్ ఇన్ యాక్టివిటీగా పరిగణిస్తారు. దీని ఆధారంగా రీసెర్చర్లు 197 దేశాల్లో సర్వే చేశారు. 2000 సంవత్సరం నుంచి 2022 వరకు యువత ఫిజికల్ యాక్టివిటీ రిపోర్టులను పరిశీలించారు. 2000 సంవత్సరంలో మన దేశ యువతలో 22 శాతం మంది ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉండగా.. అది 2010 నాటికి 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని రీసెర్చర్లు తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి 60% మంది ఫిజికల్లీ అన్ ఫిట్​గా ఉంటారని చెప్పారు.

వరల్డ్ వైడ్ గా 31 శాతం మంది.. 

ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది యువత ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉన్నారని స్టడీలో తేలింది. ఇది 2010లో 26.4 శాతం ఉండగా, 2022 నాటికి మరో 5 శాతం పెరిగిందని వెల్లడైంది. ఇది ఇలాగే కొనసాగితే ఫిజికల్ యాక్టివిటీని 15 శాతం పెంచాలన్న ప్రపంచ దేశాల లక్ష్యం నెరవేరదని రీసెర్చర్లు పేర్కొన్నారు. వరల్డ్ వైడ్ గా ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉన్న యువతలో ఆసియా పసిఫిక్ రీజియన్ ఫస్ట్ ప్లేసులో, దక్షిణాసియా  రీజియన్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. దక్షిణాసియా రీజియన్ లో మగవాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది అన్ ఫిట్ గా ఉన్నారని చెప్పారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 60 ఏండ్లకు పైబడిన పెద్దలు కూడా తగినంత శారీరక శ్రమ చేయడం లేదని రీసెర్చర్లు పేర్కొన్నారు.