అక్షర ప్రపంచం : సరిగ్గా తూచిన త్రాసు

తరాజు 34 సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ పుస్తక రచయిత డా.కాంచనపల్లి గోవర్ధన రాజు. ఈ వ్యాసాలలో కొందరు కవుల కవిత్వాన్ని వివరిస్తాడు. విశ్లేషిస్తాడు. ముఖ్యంగా తాను దర్శించిన వారి సాహితీ వ్యక్తిత్వాన్ని ఒకటి రెండు మాటల్లోనే అందంగా అభివ్యక్తీకరిస్తాడు. ఆయన ఎవరి గురించి ఏం చెప్పాడో చూద్దాం. 

నేడు కొందరు కవితల్ని రాసింది రాసినట్లుగా మళ్ళీ కనీసం తిరిగి చూసుకోకుండా ఫేస్ బుక్ ఎక్కించడం, ఒకరికొకరు అవార్డులు ప్రకటించుకోవడం, కొత్త కొత్త ప్రక్రియలు సృష్టించి వదిలేయడం చూస్తుంటాం. 

ఏ విషయాన్ని ఏ భావాన్ని చెప్పదలచుకున్నా ఒక విస్ఫులింగంలా పాఠకుని గుండెల్లో నాటేలా చెప్పడం దాశరథి ప్రత్యేకత. పద్యమైనా, గేయమైనా, వచనమైనా ఆయన సాహిత్యం పఠితను ఝంఝామారుతంలా చుట్టేస్తుంది. సినారెది పద్యం, పాట, కథాకావ్యం, వచన కవితలలో ప్రత్యేకశైలి. భావ అభ్యుదయ విప్లవ కవిత్వాది ఉద్యమాలన్నిటిని తనలో జీర్ణం చేసుకున్నాడు. జ్ఞానపీఠాన్ని అధిష్టించిన ‘విశ్వంభర’లో ఆయన కవితా విశ్వరూపం కనపడుతుంది. ఆయన సిద్ధాంత గ్రంథంలో ఆగకుండా చదివించే శైలీ నైగనిగ్యం ఉంది. ఆయన ప్రతి ప్రసంగంలో కచ్చితంగా కొత్త విషయం ఉంటుంది. 
 

ఏ కవైనా ఆశారాజులాగా ఇంద్రధనస్సు నేలమీద పడితే... రంగులన్నీ పక్షులై పైకి లేస్తే... అది ఆకాశాన్ని చేతితో తాకే ‘చార్మినార్​’గా ఎలా గుర్తిస్తాడు? వాన చినుకులు ముత్యాలైతే... కురులు తడిసి పాయలుగా పారితే... అది చరిత్రను మోస్తున్న ‘మూసీనది’ అని ఎందుకంటాడు? మేఘాల గూడు ‘ఫలక్ నామా’ గురించి ఎందుకు పలవరిస్తాడు? ప్రతి అంశంలో రెండో పార్శ్వం చూడడం ఆశారాజు కవిత్వంలోని అద్భుతాంశం. ఏనుగు నరసింహారెడ్డి నికార్సైన కవి. అభివ్యక్తిని వస్తు నిర్వహణలో సమతుల్యం చేసిన సమర్థుడు. 
 

సామ్యవాదాన్ని మానవతతో అనుసంధానం చేసి ఈనాటి సమాజానికి అవసరమైన శైలిని వ్యక్తిని నిర్మించిన దార్శనికుడు. అమ్మంగి వేణుగోపాల్ కవిత్వం ఒక సుళ్ళు తిరిగే నది కాదు. వేగంగా పాఠకుణ్ని తాకే హోరుగాలి అసలే కాదు. నింపాదిగా ప్రవహించే సరస్సు. చదువరిని అతి శీతలంగా స్పృశించే పిల్ల గాలి. ఇంత నెమ్మదస్తుడైన వ్యక్తి సమకాలికాంశాలకు వేగంగా స్పందిస్తాడు. 
 

సాహితీ క్షేత్రంలోని ప్రధాన స్రవంతిలో ఎస్.వి.సత్యనారాయణ కొనసాగడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆయన స్పందించే హృదయ సౌకుమార్యం. రెండోది తాను సామాజిక బాధ్యతను ఎప్పుడూ విస్మరించకుండా ఉండడం. 

అన్నవరం దేవేందర్ అనితర సాధ్యమైన తెలంగాణ గ్రామ పదాలను కవిత్వం లోపల అలవోకగా అమరించి కవితా రచనకు సరికొత్త శిల్పాన్ని చేకూర్చినవాడు. ఆచార్య ఫణీంద్ర కాల ప్రవాహానికి తనను తాను అనుగుణంగా మలచుకొన్న ఉద్యమ పద్యకవి. మడత భాస్కర్ శైలి ప్రతి కవితలోను కొత్త నిగారింపును మనసుకు హత్తుకుంటుంది. లేత కిరణాలు స్పృశించేటప్పుడు వరిపొలాలు పొందే అనుభూతి చదువరిని నాటుకుంటుంది. వనపట్ల సుబ్బయ్య కవిత్వీకరించేటప్పుడు ఆయన ఒడుపుదనం కనబడుతుంది. వస్తువును తనలో మమేకం చేసుకొని ప్రతిపాదికలతో రచనను ప్రణాళికాబద్ధంగా కొనసాగించడం ఆయన ప్రత్యేకత. ఆవేశానికి ఆలోచన జోడించడం, ఉద్యమాన్ని ఉద్రేకాన్ని అనివార్యంగా ఒక సంయమనంతో బిగించి తాను అనుకున్న వస్తువును నిలకడగా చెప్పడం యెన్నం ఉపేందర్ పద్ధతి.
 

ప్రవహించే వాగు పక్కకు తవ్వుకునే చిరుచెలిమె లాగా ‘ఆత్మీయ’ నిర్మల అనేక కోణాలనుండి ప్రవహించే తన సంఘసేవ పక్కన కవితలను తవ్వుకుంటుంది. నిర్మలమైన నీళ్ళను పాఠక బాటసారులకు అందిస్తుంది. జ్వలిత రచన అనుక్షణం జ్వలిస్తూ ‘ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెద’ అన్న దాశరథిని స్ఫురింపజేస్తుంది. వాసరచెట్ల జయంతి కవిత్వం అతి సాధారణమైన వాక్యాలుగా మొదలవుతుంది. క్రమంగా ఒక మొగ్గ మన కళ్ళముందే వికసించి పూవైనట్లుగా, చీకటి మెల్లగా విచ్చుకొని వెలుగు మనందరినీ ఆక్రమించినట్టుగా... మనలోనికి ప్రవహిస్తుంది.
 

కొన్ని కావ్యాల గురించి కాంచనపల్లి ఎంత అందంగా సమర్థవంతంగా చెప్పాడో చూద్దాం. దేవనపల్లి వీణావాణి జీవితమే ఆమె కవిత్వం. ఆమె బాల్యం, పుట్టిన ఊరు, ఎదిగొచ్చిన తీరు అప్రయత్నంగా తన వాక్యాలుగా మలచుకుంటుంది. ఆమె ప్రతీకలను కొంచెం కొంచెం ఒలుస్తూపోతే వీణ (నిక్వణ) దొరుకుతుంది. ఆమె కవిత్వ మర్మం తెలిసిపోతుంది. అనుమాండ్ల భూమయ్య ‘మకర హృదయం’ అతి సులభమైన దారిలోనే అపార గంభీరతను సంతరించుకున్నది. సుభగమైన శైలిలోనే సంక్లిష్టమైన తాత్వికతను ప్రతిపాదిస్తున్నది. సంప్రదాయక పద్య రచనలోనే అత్యాధునిక అభివ్యక్తిని ప్రోది చేస్తున్నది. పొన్నాల బాలయ్య ‘దందెడ’ తెరిస్తే అసలు రూపం తెలుస్తది. అతని అడుగుల బలం తెలుస్తది. అసలు పొన్నాల బాలయ్య ఎట్లా అక్షరమై నిలబడుతున్నడో తెలుస్తది. బాణాల శ్రీనివాస్ ‘కుంపటి’ని ఉటంకిస్తూ ‘‘బతికి ఉన్న తల్లిదండ్రులనే పట్టించుకోలేని అతి వేగవంతమైన మెటీరియలిస్టిక్ ప్రపంచంలో, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనిషిలోని ప్రతి అణువును శాసిస్తూ జీవితాన్ని గ్లోబలైజ్ చేస్తున్న తరుణంలో ఇలా వెలిగించిన కుంపటి అసలు ఆరిపోకూడదు’’ అని కాంచనపల్లి పేర్కొంటడు. 
 

కొన్ని వ్యాసాల ముగింపులు ముచ్చటగా ఉంటాయి. బి.ఎస్. ఎం.కుమార్ ది అసాధారణమైన మార్గం... ‘‘ఈ కవి, ఇంకా రాస్తూనే ఉండాలి. రాస్తూ రాస్తూ అతని దుఃఖపు రవ్వలజడిలోని కాంతితో సమాజాన్ని తడువుతూనే ఉండాలి. ‘‘విలాసాగరం రవీందర్ రాస్తూ నడుస్తుండాలి, నడుస్తూ రాస్తుండాలి’’, ‘‘తెలుగు సాహిత్యం, తెలుగు సమాజం ఎన్ని రోజులుంటుందో సినారె అన్ని రోజులు మనతో ఉంటాడు.’’ కొన్ని ముగింపులు కవికి మార్గనిర్దేశం చేస్తాయి. వేణుశ్రీ ఉద్యమస్పృహతో వచ్చిన కావ్యాన్ని ఆహ్వానిస్తూనే, నిరంతర రచనా సాధన వల్ల వచ్చే కళాత్మక వ్యక్తీకరణను ఉద్యమ స్పృహకు జోడించాలని ఉద్బోధించాడు.
 

ఇంకా ఈ వ్యాసాల్లో తెలంగాణ ప్రాచీన సాహితీ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసిన కవులను, తెలంగాణ అత్యాధునికంగా శిరసెత్తుకున్న తీరును, దీర్ఘకవితల్లో తెలంగాణ పెనువరదలా, మత్తడి పొంగి ప్రవహించిన తీరును తెలుసుకుంటం. కవుల సంగమమైన తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రావతరణానంతర కవిత్వాన్నీ చదువుకుంటం. ‘అజ్ఞాన కవితా వికాసం’లో16 మంది కవి కార్యకర్తల కవిత్వ పరిచయం ఉంది. గోపి కవిత్వానికి అనువాదకుల అనుస్పందనలూ ఉన్నాయి. ‘తపతీ సంవరణం’ వ్యాసం ద్వారా ఆనాటి సామాజిక జీవనం, చరిత్రలను ఆకళింపు చేసుకుంటాం.
 

నేడు కొందరు కవితల్ని రాసింది రాసినట్లుగా మళ్ళీ కనీసం తిరిగి చూసుకోకుండా ఫేస్ బుక్ ఎక్కించడం, ఒకరికొకరు అవార్డులు ప్రకటించుకోవడం, కొత్త కొత్త ప్రక్రియలు సృష్టించి వదిలేయడం చూస్తుంటాం. కాంచనపల్లి రాసిన ఒక వ్యాసంలో కవిత రాయడానికి ముందు కవి వస్తువును ఎలా ఎన్నుకోవాలో, శీర్షిక, ఎత్తుగడ, నిర్వహణ, ముగింపులను ఎలా నిర్వహించాలో చక్కగా వివరించారు. అన్ని వ్యాసాలలో మంచిచెడుల విశ్లేషణ చక్కగా సాగింది. విమర్శలో కాంచనపల్లికి తనదైన దృక్పథం ఉంది. ఇందులో పేర్కొన్న అందరు కవుల కవిత్వాన్ని సరిగ్గా తూచిన త్రాసు ఈ పుస్తకం.

ప్రతులకు: 96760 96614
ఎ. గజేందర్ రెడ్డి