సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా సదాశివనగర్మండలంలోని కుప్రియాల్లో టమాటా రైతు పంట పడింది. గ్రామానికి చెందిన ఏలేటి స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో టమాటా సాగు చేపట్టారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదన్పల్లిలో సాగు చేస్తున్నట్టుగా వ్యవసాయ పద్ధతులను పాటించారు. రెండు నెలల కింద మొక్కలను తీసుకొచ్చి మల్చింగ్పద్ధతిలో నాటారు. అధిక దిగుబడి కోసం మొక్కలకు తీగలు ఏర్పాటు చేసి ఎండ తగిలేలా జాలీలు కట్టారు.
ఫలితంగా ఒక్కో చెట్టుకు 50 నుంచి వంద కాయలు కాసి తొందరగానే పండ్లుగా మారాయి. దీంతో ప్రతీ రోజు 10 మంది కూలీలతో టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, హైదరాబాద్ కు తరలించి అమ్ముతున్నారు. ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు. టమాటా సాగుకు ఎకరం భూమికి సుమారుగా
రూ. 2 లక్షల ఖర్చు అవుతుందన్నారు. టమాటాతో పాటు వంకాయ, మిర్చి పంటలను పండిస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కలిపించి ఆర్థికంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. గతంలో బండ రాళ్లగా ఉన్న ఈ భూమిని తీసుకుని చెరువు మట్టి పోసుకొని సాగుకు అనుకూలంగా మార్చుకున్నట్లు భూంరెడ్డి వివరించారు.