కుక్క.. విశ్వాసానికి మారుపేరు. ఒక్కసారి దాని కడుపు నింపితే.. చచ్చేదాకా అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది. కుక్కల విశ్వాసాన్ని నిరూపించే ఎన్నో ఘటనలను ఇటీవల మనం ఎన్నో చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. యజమాని మరణించారని తెలియని ఓ శునకం 4 నెలలుగా ఆయన కోసం ప్రతిరోజూ వేచి చూస్తోంది. స్థానికులు తీసుకెళ్దామని ప్రయత్నించినా అక్కడి నుంచి కదలట్లేదు. ఆస్తులు, అంతస్తులు ఇచ్చినా తల్లిదండ్రులను పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో.. తనను పెంచిన యజమాని కోసం వెతుకుతూ మార్చురీ పరిసరాల్లో నిత్యం తిరుగుతోంది.
విశ్వాసంలో కుక్కను మించిన జంతువు మరొకటి ఉండదు. మనుషులు కూడా దీని విశ్వాసం ముందు తీసికట్టు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. నాలుగు నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది.
నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతడి పాటు పెంపుడు కుక్క కూడా ఆస్పత్రికి వచ్చింది. అయితే.. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది అతడి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అది చూసిన కుక్క.. యజమాని వస్తాడని మార్చురీ ముందు ఎదురుచూస్తోంది.
ALSO READ : బీట్ రూట్, పాలకూర జ్యూస్ తో గుండె పదిలం
నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆస్పత్రి సిబ్బంది కుక్కను ఎన్నిసార్లు అక్కడ నుంచి పంపించినా మళ్లీ వచ్చేస్తోంది. యజమాని మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లడం చూసిన కుక్క.. ఇంకా అక్కడే ఉన్నాడని భావిస్తోందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అక్కడ నుంచి కుక్కను ఎంత పంపినా వెళ్లడం లేదని చెప్పారు.