ఇదేందే ఇది.. మటన్ ముక్కల కోసం బట్టలు చినిగేలా ఫైట్..

తెలంగాణలో కార్యం ఏదైనా ముక్క, చుక్క పక్కా ఉండాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగిన మనోళ్లు కాంప్రమైజే కారు. కొన్ని సార్లు తమకు ముక్క, చుక్క తక్కువ అయ్యిందని గొడవలకు దిగిన ఘటనలు కూడా మనం ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం నవీపేట మండలంలో స్థానిక ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‎లో ఓ పెళ్లి జరిగింది. అయితే, విందులో పెళ్లి కొడుకు తరుఫు వారికి ఎక్కువ మటన్ ముక్కలు వడ్డించలేదని పెళ్లి కూతురు తరుఫు వారితో ఘర్షణకు దిగారు. 

మటన్ ముక్కల కోసం మొదలైన ఈ పంచాయతీ చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరుఫు బంధువులు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన చుట్టాలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి విందులో మటన్ ముక్కల కోసం బట్టలు చినిగేలా కొట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.