నువ్వు బతికి వేస్ట్​..చచ్చిపో..మనస్తాపంతో ఉరేసుకుని డిగ్రీ స్టూడెంట్‌ సూసైడ్

  • యువతితో అసభ్యకరంగా చాట్‌ చేసిన యువకుడు 
  • నిందితుడిని అరెస్ట్ చేసిన భువనగిరి పోలీసులు 

యాదాద్రి, వెలుగు : యువకుడు అసభ్యకరంగా మాట్లాడడం, చచ్చిపోవాలంటూ చాట్‌ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ డిగ్రీ స్టూడెంట్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. భువనగిరి టౌన్​సీఐ సురేశ్​కుమార్​తెలిపిన ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఎలగందుల సతీశ్‌ కుమార్తె హాసిని (20) సికింద్రాబాద్ వెస్ట్​మారేడ్‌పల్లిలోని కేజీబీవీలో డిగ్రీ సెకండియర్​చదువుతోంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన నిఖిల్‌తో హాసినికి ఇంటర్‌లో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత హాసిని డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వెళ్లడం, నిఖిల్​కూడా మేడ్చల్​జిల్లా మేడిపల్లికి వచ్చి అక్కడే ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా ఇటీవల హాసిని ఇంటికి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో బంధువును పరామర్శించేందుకు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చే సరికి హాసిని ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వివరాలు సేకరించారు.

యువతి ఫోన్‌ను పరిశీలించగా ఓ యువకుడితో చేసిన చాటింగ్‌ బయటపడింది. అందులో యువకుడు అసభ్యకరంగా తిట్టడంతో పాటు, ‘నువ్వు బతికి వేస్ట్‌.. చచ్చిపో’ అని కామెంట్ చేశాడు. దీంతో యువతి ‘సరే’ అంటూ రిప్లై ఇచ్చింది. యువకుడి చాటింగ్‌ కారణంగానే తమ కూతురు హాసిని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రి సతీశ్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నిఖిల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.