మేతకు వెళ్లి బోరుబావి గుంతలో ఇరుక్కుపోయిన ఆవు..కాపాడిన రైతులు

లింగంపేట, వెలుగు : మేతకు వెళ్లిన ఆవు బోరుబావి గుంతలో ఇరుక్కుపోయింది. ఈ  ఘటన  కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం... పెద్దోళ్ల మల్లయ్య అనే రైతు తన పొలంలో యాసంగి సీజన్​లో బోర్​బావి తవ్వించాడు. నీళ్లు పడకపోవడంతో  కేసింగ్​ పైపును తొలగించి మట్టితో పూడ్చివేశాడు.  

ఇటీవల కురిసిన వర్షంతో బోర్​బావి పూడ్చిన మట్టి కుంగింది. గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన సొనబోయిన అంజయ్య అనే  రైతుకు చెందిన ఆవు మేత కోసం వెళ్లి బోర్​బావి గుంతలో కూరుకుపోయింది.  గమనించిన రైతులు ఆవు యజమాని అంజయ్యకు సమాచారం అందించారు.  

గ్రామానికి చెందిన పలువురు రైతులు ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో ఆవును సురక్షితంగా బయటకు లాగి కాపాడారు. ప్రమాదవశాత్తు మనుషులు పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదన్నారు.