భ్రష్టు పడుతున్న రాజకీయ వ్యవస్థ

 2014లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది. కేసీఆర్‌‌‌‌ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలంగాణలో ఉద్యమ నినాదాలకు తిలోదకాలు ఇచ్చి నియంతృత్వ పాలన సాగింది.  నేనే రాజు,  నేనే మంత్రి అనే రీతిలో నియంత పాలన సాగించారు. ప్రతిపక్షాలు లేని వ్యవస్థ కావాలని కలలు కన్నారు. ప్రతిపక్షాలను గౌరవించకుండా, వాటిని గుర్తించకుండా పాలన చేశారు. 2014లో టీడీపీ నాయకులను, ఎమ్మెల్యేలను మొత్తం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో కలుపుకొని టీడీపీకి తెలంగాణలో ఉనికి లేకుండా చేశారు.  ఆ తరువాత కాంగ్రెస్‌‌‌‌ నాయకులను కూడా కొనుగోలు చేసి ఆ పార్టీని బలహీనపర్చారు.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రత్యేక పాత్ర పోషించిన సీపీఐ ఎమ్మెల్యేను కూడా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేర్చుకున్నారు. 2018లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దూకుడు మరింత పెంచారు. తెలంగాణ అంటే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనే అహంభావంతో  వ్యవహరించారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వంలో అవకతవకలు

ప్రభుత్వ యంత్రాంగంలోని ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌లు, ఉన్నతాధికారులు.. కేసీఆర్‌‌‌‌కు నచ్చినవారు తొమ్మిది నుంచి పది సంవత్సరాల వరకు ఒకే పదవిలో ఉన్నారు.  పది జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు చేసి పరిపాలన చిన్నాభిన్నం చేశారు.  ఏకపక్ష నియంతృత్వం, మేధావుల సలహాలు తీసుకోకపోవడం,  ఏకవ్యక్తి పోకడలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. చట్టాలను చట్టుబండలు చేశాడు.

 సాగునీటి ప్రాజెక్టులులో..ప్రాణహిత– చేవేళ్ళ సాగునీటి ప్రాజెక్టులు పనులను పక్కకు పెట్టి మేడిగడ్డ అన్నారు. సుందిళ్ల బ్యారేజిలు కట్టి కాళేశ్వరం రూపొందించారు. కాళేశ్వరం పేరుతో ప్రత్యేక కార్పొరేషన్‌‌‌‌ పెట్టి దాదాపు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు చేశారు. తీసుకొచ్చిన అప్పులకు మిత్తి రూ.14 వందల  కోట్ల  రూపాయలు కట్టాలని  నోటీస్‌‌‌‌ రావడం ఇది ఆర్థిక అరాచకత్వానికి అద్దం పడుతున్నది.

 అడ్డగోలుగా విద్యుత్‌‌‌‌ వ్యయం, అప్పులు, వాటికి మిత్తీలు కాళేశ్వరం ప్రాజెక్టు రూపేణా ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపారు.  సాగునీటి  ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్‌‌‌‌  ఒంటెద్దు పోకడలు అనేక తప్పటడుగులు వేశారు.  సిద్ధిపేటతోపాటు కేసీఆర్‌‌‌‌  ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌కు నీళ్లు వచ్చే విధంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌‌‌‌ నిర్మాణం చేయడం జరిగింది.  ఆ ప్రాజెక్టు నిర్మాణ  లోపాల మూలంగా  ఇప్పుడు  మేడిగడ్డ వద్ద  పిల్లర్లు కుంగిపోవడం, సుందిళ్ల వద్ద ప్రాజెక్టులకు బుంగలు పడటం కేసీఆర్‌‌‌‌ మార్కు పాలనకు అద్దం పడుతోంది.

 కృష్ణా నది బేసిన్‌‌‌‌లో ఉండే ప్రాజెక్టులను పట్టించుకోలేదు.  చత్తీస్​గఢ్​ నుంచి అధిక ధర పెట్టి 1000 మెగావాట్ల విద్యుత్‌‌‌‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంతో రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితులు అవలంబించారు. తద్వారా ఆర్థిక అరాచకానికి పాల్పడ్డారు.  ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు.  గ్రూప్స్‌‌‌‌ పరీక్ష పత్రాలు లీకేజీలుతో 30 లక్షల మంది విద్యార్థుల బతుకులను అగమ్యగోచరంగా మారింది.  విద్యుత్‌‌‌‌ కొనుగోలు,  ఆర్థికం,  సాగునీటి ప్రాజెక్టులు,  కాళేశ్వరం ప్రాజెక్టులపైన కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం శాసనసభలో  శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో చోటు చేసుకొన్న వైఫల్యాలను ఎండగట్టింది. 

పొత్తు ధర్మాన్ని పాటించలేదు

పొత్తు పెట్టుకున్న పార్టీలతో  కేసీఆర్‌‌‌‌ పొత్తుధర్మాన్ని పాటించలేదు.  ప్రతిపక్షాలను గొంతు నొక్కడం,  ప్రజాసమస్యల వేదిక ప్రజాగొంతుక అయిన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌‌‌ ఎత్తివేసిన ఘనత కూడా కేసీఆర్‌‌‌‌కే చెల్లుతుంది. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌‌‌ ఎత్తివేసి హైదరాబాద్‌‌‌‌ బయట ఎక్కడో ధర్నాలు చేసుకోవాలని చెప్పడం,  ప్రతిపక్ష పార్టీల పోరాటం, ముఖ్యంగా వామపక్ష, ప్రగతిశీల శక్తుల  పోరాటం వలన హైకోర్టు ఉత్తర్వులలో తిరిగి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌‌‌ సాధించుకోవడం జరిగింది.  ఇందిరాపార్కు ధర్నా చౌక్​ సాధనలో ఉద్యమ నాయకులపైన  కేసులు కూడా ఉన్నాయి.

 అప్పుడు పోరాటం చేసి ధర్నా చౌక్‌‌‌‌  సాధించుకుంటే, అదే ధర్నా చౌక్‌‌‌‌లో నేడు  కేసీఆర్‌‌‌‌ ధర్నాలో కూర్చున్నాడు.  ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అనేవిధంగా రాజకీయాలను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌‌‌‌కు ఇప్పుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మునిగిపోయే ప్రమాదంగా ఉన్నది.  ప్రతిపక్షాలు లేని రాజకీయాలు కోరుకున్న కేసీఆర్‌‌‌‌కు నేడు ప్రతిపక్ష స్థానం కూడా కరువయ్యే విధంగా ఆయన పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. చెడపకు రా చెడేవు అనే మాట కేసీఆర్‌‌‌‌ కు  స్పష్టంగా సరిపోతున్నది.

 తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్​ క్షేత్రస్థాయి పరిస్థితులు గ్రహించుకోవాలి.  కేసీఆర్‌‌‌‌ చేసిన తప్పులు నూతన ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు.  ప్రతిపక్షాలను గౌరవించడం,  ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రభుత్వాన్ని నిర్వహణను ప్రజలు ఆశిస్తారు. కేసీఆర్‌‌‌‌ పాలనలో చేసిన తప్పులు మూలంగా రేషన్‌‌‌‌కార్డులు,  మౌలిక సదుపాయాలు, పక్కా ఇండ్లు,  నిరుద్యోగ,  సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌, కాంట్రాక్టు ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఇతర సమస్యల గత 10 సంవత్సరాల నుంచి కొనసాగించకపోవడం వలన దాదాపు 1 కోటి 30 లక్షల దరఖాస్తులు ప్రజాపాలనలో వచ్చాయి.  కేసీఆర్‌‌‌‌ తన అస్తిత్వాన్ని కోల్పోయే దశలో ఉండటం ఇదొక గుణపాఠం.

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ 

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఆదేశానుసారం డీసీపీ, ఏసీపీ స్థాయి పోలీసు అధికారులు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడటం జరిగింది. ఈ కేసులో విస్తుగొల్పే విషయాలు బయటకు వస్తున్నాయి.  రాజకీయ నాయకులు, అధికారుల వ్యక్తిగత సంభాషణలు కూడా రికార్డు చేశారు.  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్​ చేసి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం సీరియస్‌‌‌‌ చర్యలు తీసుకొని ఇప్పటికే పోలీస్‌‌‌‌ అధికారుల ప్రభాకర్‌‌‌‌ రావును, ప్రణీత్‌‌‌‌రావు,  మాజీ  డీసీపీ రాధాకృష్ణారావులను అదుపులోకి  తీసుకోవడం జరిగింది.

ఇంటెలిజెన్స్‌‌‌‌ చీఫ్​ ఆదేశాలతో ఫోన్‌‌‌‌ ట్యాపింగ్​ వ్యవహారం విచ్చలవిడిగా సాగింది. అంతేగాకుండా పోలీస్‌‌‌‌ వాహనాలలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ డబ్బు తరలించారనే విషయం వెల్లడైంది.  ఈ వ్యవహారంలో కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌కు కూడా ఉచ్చు బిగిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వారి అరాచక,  అవినీతిలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పదవీ విరమణ అయినవారిలో వారికి నచ్చినవారిని ఓఎస్డీలుగా పదవీ కాలం పొడిగించారు.

- చాడ వెంకటరెడ్డి,
సీపీఐ జాతీయ 
కార్యవర్గ సభ్యుడు