పాలనాశైలి మారితే మంచిది

ప్రజాస్వామ్యంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం సమాజంలో చోటు చేసుకుంటున్న ఆకాంక్షలను, అవసరాలను పాలకులు దృష్టిలో పెట్టుకొని విధానాలను రూపొందించవలసిన అవసరం ఉందని ఇటీవల లోక్​సభ ఎన్నికల ఫలితాలు  సంకేతమిచ్చాయి. 18 వ లోక్​సభ ఎన్నికల ఫలితాలు ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినట్లు అయింది. అధికార పార్టీ అధికారానికి కత్తెర వేయడం ప్రతిపక్ష పార్టీకి మరింత బలాన్ని చేకూర్చడం ఎన్నికల సారాంశం. నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనలో అమలు జరిపిన తిరోగమన ఆర్థిక విధానాలకు  నియంత్రణ పెట్టాలని ఓటర్లు చెప్పకనే చెప్పారు. లోక్​సభలో అధికార పార్టీకి 400 సీట్లు కావాలని మోదీ ప్రజలను అనేక సందర్భాల్లో అభ్యర్థించినప్పటికీ కేవలం 240 స్థానాలకు కుదించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి మరింత జీవసత్వాలను ఇవ్వడం జరిగింది. అంటే.. నియంతృత్వ పోకడలను, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను ప్రజలు అంగీకరించలేదని భావించాలి.

ప్రజలు తమ ఎజెండా గుర్తుచేశారు

అయోధ్యలో రామ మందిర నిర్మాణం మాత్రమే ప్రజలకు నిరంతర సమస్య కాదని.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా  90 శాతం ప్రజల అవసరాలు అభివృద్ధి ప్రధానమని.. ప్రస్తుత పాలకులు గుర్తించడం అవసరమని ప్రజల తమ ఓటు ద్వారా తెలియచేయడం జరిగింది.  కేవలం ఆర్థికేతర అంశాలను దశాబ్దాల తరబడి ఎన్నికల ఎజెండాగా మార్చినప్పుడు ప్రజలు తమ ఎజెండాను వ్యక్తీకరించడం సహజమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ల సహకారంతో మాత్రమే బీజేపీ 18వ లోక్​సభలో అధికారం పొంది కొలువుదీరింది. కానీ, ఈ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనేక పాఠాలు అందించిందని చెప్పవచ్చు.

పెరిగిన ధరలు 

గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక విధానాలను పునః పరిశీలింప వలసిన పరిస్థితులు ఆసన్నమైనాయి.  పేద ప్రజలను నిత్యం వేధిస్తున్న  ధరల పెరుగుదల, పెరిగిన పరోక్ష పన్నుల భారం, నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయి. ధరల పెరుగుదల పరోక్ష పన్నుల భారం పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని మన పాలకులు గుర్తించ లేకపోయారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 50% తగ్గినప్పటికీ మనదేశంలో మాత్రం పెట్రోల్​డీజీల్, వంట గ్యాస్ ధరలు గత పది సంవత్సరాలలో 80% పైగా పెరిగినాయి. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించే కార్పొరేట్ సంస్థలపై విధించే కార్పొరేట్ పన్నును తగ్గించడం జరిగింది. కానీ పేద, మధ్యతరగతి ప్రజలపై మోపుతున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం మాత్రం తగ్గడం లేదు.  కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్నాయని ప్రజలు ఈ ఎన్నికలలో చెప్పారు. 

వెనుకబాటు పెరుగుతున్నది

నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని అభివృద్ధికి నోచుకోని అనేక వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు, ఆదివాసీలు, గిరిజన ప్రాంతాలు, ఎలాంటి రాజ్యాంగ భద్రత లేని జీవులుగా మారిపోతున్నారు. సమగ్ర కుల గణనకు, జనాభా లెక్కలకు కూడా ఇష్టపడటం లేదు. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి డెవలప్​మెంట్​ ప్రోగ్రాం వారు రూపొందించే మానవాభివృద్ధి సూచిక ప్రకారం దాదాపు 180 దేశాలలో మన దేశం గత పది సంవత్సరాలలో 126 వ స్థానం  నుంచి 134 స్థానా
నికి దిగజారింది. మానవాభివృద్ధిలో భారతదేశం అనేక తూర్పు ఆసియా దేశాల కంటే మరింత వెనుకబడి ఉన్న విషయం తెలియనిదేమికాదు.  ఉపాధి అన్వేషణలో లక్షలాది మంది యువత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలలో రోజువారీ వేతనాలకు శ్రమిస్తున్నారు. 

మోదీ ఆలోచనలు ఇప్పటికైనా మారాలి

ఇటీవల ఎన్నికలలో రాజ్యాంగం, రిజర్వేషన్లు అల్ప సంఖ్యాక వర్గాల హక్కులు మొదలైన అంశాలు విస్తృతంగా చర్చకు రావడం జరిగింది. పేద ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ధరల పోకడ, ప్రాంతాల, సామాజిక వర్గాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలు సామాజిక భద్రత అనే అంశాలు పాక్షికంగానే చర్చించడం జరిగింది. లోక్​సభలో బలమైన ప్రతిపక్షం ఏర్పడింది. అతి త్వరలోనే మహారాష్ట్ర, యూపీలాంటి పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది. ఎన్నికలలో ప్రజల మనోభావాలను అదేవిధంగా మారుతున్న  అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా పేద ప్రజల ఆర్థిక ఎజెండాను అమలు చేయవలసిన అవసరం ఉందని  ప్రధాని మోదీ గుర్తించవలసిన అవసరం ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని. కేంద్రం విధిస్తున్న ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ గ్యాస్ లాంటి నిత్యవసర వస్తువులపై విధిస్తున్న పరోక్ష పన్నులు సవరించుకోవలసిన అవసరాన్ని గుర్తించాలి. రాజ్యాంగ వ్యవస్థలను, విలువలను, హక్కులను కాపాడుకుందాం అని ఇటీవల లోక్​సభ ఎన్నికలలో ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయాలను ప్రజలు నిర్లక్ష్యం చేయలేదని కూడా పాలక పక్షం గుర్తిస్తే మరీ మంచిది. 

సంపద కుబేరుల వశమైతున్నది

సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభావంతో దేశ  ఆర్థిక వ్యవస్థ కేవలం ఉద్యోగిత లేని వృద్ధిని సాధిస్తున్న విషయం గమనించాలని ప్రజలు ఎన్నికల ద్వారా అధికార పక్షానికి సూచించారు. కుబేరుల ఆస్తులు పెరగడం ద్వారా భారత్ వికసించవచ్చునేమో గాని పెరుగుతున్న వృద్ధిరేటు పేద వర్గాలకు పంచింది అంతంత మాత్రమే అని మనం గత 50 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకం కొనసాగింపే ఒక చక్కటి ఉదాహరణ అవుతుంది. కుబేరుల, ధనవంతుల అభివృద్ధి ద్వారా దీర్ఘకాలంలో పేదలకు కూడా ఎంతో కొంత ప్రయోజనం లభిస్తుందని చెప్పే ట్రికిల్ డౌన్ ఆర్థిక సిద్ధాంతం ప్రకారమే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు అమలు అవుతున్నాయని చెప్పవచ్చు.

- ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ