పుట్టిన రోజే.. చివరి రోజైంది!..క్యాన్సర్ తో పోరాడుతూ బాలుడు మృతి

  • ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో 
  • కుటుంబంలో తీవ్ర విషాదం 
  • జగిత్యాల జిల్లా మెట్‌పల్లి టౌన్ ఘటన

మెట్ పల్లి, వెలుగు : పుట్టిన రోజే బాలుడికి చావు రోజైంది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్క కొడుకు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి టౌన్ అర్బన్ కాలనీకి చెందిన అస్రార్ ఖాన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అతని కొడుకు ఖలీల్ ఖాన్(15) స్థానిక ప్రైవేటు స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. ఆరు నెలల కింద ఖలీల్ దగ్గు బారిన పడ్డాడు. హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో ఖలీల్ కు టెస్టులు, స్కానింగ్ చేయించగా క్యాన్సర్ గడ్డ అయిందని డాక్టర్లు నిర్ధారించారు. 

అప్పటి నుంచి ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా తగ్గడంలేదు. బుధవారం ఖలీల్ పుట్టినరోజు కావడంతో ఉదయం కుటుంబ సభ్యులు వేడుకలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి అకస్మాత్తుగా అతడు చనిపోయాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  గురువారం అంత్యక్రియలు పూర్తి చేయగా.. పుట్టినరోజే చావు రోజు అయిందా బిడ్డా.. అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.