74 ఏండ్ల వయసులో గుడ్డుపెట్టిన పక్షి

ఈ పక్షి రెండు రూల్స్ బ్రేక్​ చేసి, రికార్డ్ సృష్టించింది. అవేంటంటే.. ఒకటి దాని జీవితకాలం. మరొకటి లేటు వయసులో గుడ్డు పెట్టడం. ఈ రెండు విషయాల్లో తనకు తానే సాటిగా నిలిచింది సముద్ర పక్షి​. దీంతో ఈ విషయం తెలిసి జంతు పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. 

విస్​డమ్​.. లేసాన్ ఆల్బట్రాస్​ అనే పక్షి జాతికి చెందింది. విస్​డమ్​ను ఆరేండ్ల వయసులో1956లో అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫీసర్లు మొదటిసారి కనుగొన్నారు. అప్పటి నుంచి హవాయి ద్వీపాల్లో నివసిస్తోంది. ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేసే ఆల్బట్రాస్ పక్షులు సాధారణంగా ఒకే పక్షితో సావాసం చేస్తాయి. 

అలాగే.. విస్​డమ్, అకేకామై అనే మగ పక్షితో కలిసి పసిఫిక్ సముద్ర ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఒకసారి సముద్రానికి వెళ్లిన అకేకామై తిరిగి రాలేదు. దాంతో చాలా ఏండ్లు విస్​డమ్ ఒంటరిగా ఉండేది. కొంతకాలం నుంచి విస్​డమ్ మరో మగపక్షితో సావాసం చేయసాగింది. ఫలితంగా ఈ ఏడాది గుడ్డు పెట్టింది. మొత్తంగా లైఫ్​టైంలో గుడ్డు పెట్టడం 60వ సారి. సాధారణంగా... ఈ పక్షులు ఏడాదికి ఒక్క గుడ్డు మాత్రమే పెడతాయి. 

గుడ్డు పెట్టిన తర్వాత సముద్ర విహారానికి వెళ్తాయి. దీంతో గుడ్డు పొదిగే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. గుడ్డును పొదగడానికి దానిపై 66 రోజుల పాటు కూర్చుంటుంది. ఇకపోతే ఇందులో మరో ట్విస్ట్​ ఏంటంటే..  ఈ పక్షుల జీవితకాలం 68 ఏండ్లే. కానీ, విస్​డమ్ ప్రస్తుత వయసు 74 ఏండ్లు. ఈ వయసులో బతికి ఉండడం, ఆరోగ్యంగా ఉండి గుడ్డు పెట్టడం అనేది అసాధారణ విషయం అని అంతా ముక్కన వేలేసుకుంటున్నారు. ఇప్పటివరకు విస్​డమ్​ పెట్టిన గుడ్లలో 30 పిల్లలు వచ్చాయని, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నట్టు పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా ఫిష్​ అండ్ వైల్డ్​ లైఫ్​ సర్వీస్​ తెలిపింది.