డివిజన్ బెంచ్​లో భిన్నాభిప్రాయాలు!

వ్యూ పాయింట్

హై కోర్టులో  ఇద్దరు న్యాయమూర్తులు ఉన్న బెంచ్​ని  డివిజన్​ బెంచ్​ అంటారు.  ముగ్గురు న్యాయమూర్తులు ఉన్న బెంచ్​లను  ఫుల్​బెంచ్​లు అంటారు.  సుప్రీంకోర్టులో ప్రతి బెంచ్​లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. దాన్ని డివిజన్ బెంచ్​ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఒక్క న్యాయమూర్తి తోనే  బెంచ్​ ఏర్పాటు చేసే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిగి ఉంటారు.  రాజ్యాంగ బెంచ్​లో ఐదుగురు కానీ, అంతకుమించి కానీ న్యాయమూర్తులు ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 145(3) ప్రకారం నిర్దిష్టమైన  ప్రశ్నలను సమస్యని  పరిష్కరించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఐదుగురిని మించి కూడా బెంచ్​ను  ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయవచ్చు.  ఇప్పటివరకు నాకు తెలిసి సుప్రీంకోర్టులో 13మంది న్యాయమూర్తులతో బెంచ్​ను ఏర్పాటు చేశారు.

న్యాయమూర్తులకు  నిర్దిష్ట సూత్రాలు

హైకోర్టు,  సుప్రీంకోర్టుల్లో డివిజన్​ బెంచ్​లో ఓ సీనియర్​ న్యాయమూర్తి, ఓ జూనియర్​ న్యాయమూర్తి ఉంటారు.  రాజ్యాంగ శాసనం ప్రకారం ఇద్దరికీ సమానమై అధికారాలు ఉంటాయి. కానీ, సీనియర్​ న్యాయమూర్తులే  బెంచ్​ను నియంత్రిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఉన్న పరిస్థితి.  అప్పుడప్పుడు కొన్ని  సంఘటనలు ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాయి. 

అందుకు ఊదాహరణ.. గుజరాత్​ హైకోర్టులో ఆ మధ్య జరిగిన సంఘటనను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇలాంటి సంఘటనకి తెలంగాణ  హైకోర్టు  మినహాయింపు కాదు. ఆ జూనియర్​ న్యాయమూర్తులు తాత్కాలిక (అడహక్) న్యాయమూర్తులు కాబట్టి అవి ఎక్కువ ప్రచారాన్ని సంతరించుకోలేదు. ఇలాంటి సంఘటనలు ఉత్తమమైన న్యాయప్రవర్తన ప్రకటనగా పేర్కొనలేం.  కానీ, అలాంటి సంఘటలు కోర్టు డెకోరమ్​పై  హెచ్చరిక  మాదిరిగా ఉపయోగపడతాయి.  న్యాయమూర్తులు కూడా మనుషులే.  అయితే, న్యాయమూర్తులకు  నిర్దిష్ట సూత్రాలు ఉంటాయి. వాటిని క్రోడీకరించాల్సిన అవసరం లేదు. అది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన విషయం.

న్యాయమూర్తులను దైవంలాగా భావిస్తాం

న్యాయమూర్తులను  దైవంలాగా భావిస్తూ ఉంటారు. కానీ, అప్పుడప్పుడు వాళ్లు మనలాంటి మనుషులే నన్న విషయం తేటతెల్లమవుతుంది. పక్షపాతాలని, భావోద్వేగాలను మన మాదిరిగానే వాళ్లు కలిగి ఉంటారని కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి. కోర్టు విచారణలు,  ప్రత్యక్ష ప్రసారాలు,  వీడియో రికార్డింగ్ యుగంలో ఇలాంటి సంఘటనలు ప్రజల మెమరీలో నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటి ఒక రిమైండర్​ ఆ మధ్యన గుజరాత్​ హైకోర్టు డివిజన్​ బెంచ్​లోని ఓ సీనియర్​ పురుష న్యాయ మూర్తి తన జూనియర్​ హైకోర్టు న్యాయమూర్తిపై గట్టిగా అరుస్తూ కోర్టు గది నుంచి దిగిపోయిన సంఘటనని దేశ ప్రజలు మరిచిపోలేదు. 

న్యాయమూర్తుల మధ్య విభేదాలు

జస్టిస్​ బిరెన్​ వైష్ణవ్,  జస్టిస్​ మౌనాభట్​లతో  కూడిన డివిజన్​ బెంచ్​.. ప్రతివాదులను కేసులో చేర్చే కేసుని విచారిస్తున్న దశలో ఈ సంఘటన జరిగింది.  ప్రతివాదులు కేసుని కొనసాగించవచ్చని బిరెన్​ వైష్ణవ్​ తీర్పుని డిక్టేట్​ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా అదేసమయంలో మౌనాభట్..​ వైష్ణవ్​కి ఏదో చెప్పడం ప్రారంభించారు. ఆ కేసులో ఆమె తన విభేదాన్ని చెప్పదలుచుకున్నట్లుగా అనిపించింది. అది జస్టిస్​ వైష్ణవ్​కి ఆగ్రహాన్ని గురిచేసింది. దాంతో అతను తన గొంతును పెంచి . ‘నా ఉత్తర్వులతో మీరు విభేదిస్తే..విభేదించండి’ అన్నారు. 

దానికి సంబంధించిన మరో కేసులో ఆర్డర్​ గురించి కోర్టు మాస్టారు కోర్టుని అడిగారు. ‘ఇదే ఉత్తర్వు. అందులో కూడా’ అన్నారు. జస్టిస్​ వైష్ణవ్ ఈ విషయంలో కూడా జస్టిస్​ భట్​ తన అసమ్మతిని తెలుపుతూ ఆయన చెవిలో గొణిగినట్లు అనిపించింది. దాంతో జస్టిస్​ వైష్ణవ్​ ఇలా అన్నారు. ‘మనం ఒక కేసులో విభేదించాం. ఇందులో కూడా మీరు విభేదించవచ్చు. 

ఈ మాటలకు న్యాయమూర్తి  భట్​ ఈవిధంగా ప్రతిస్పందించారు. ‘ఇది విభేదించడంలాంటి ప్రశ్న కాదు’. ఆ జవాబుతో జస్టిస్​ వైష్ణవ్​ మళ్లీ తన స్వరం పెంచి, తన తోటి న్యాయమూర్తితో ఇలా అన్నారు. ‘అయితే గొణగకండి. మీరు విడిగా ఉత్తర్వులు రాయండి’ అన్నారు. అంతటితో ఆగలేదు.  ‘మేం మరేమీ కేసులను తీసుకోవడం లేదు’ అని అంటూ బెంచ్​ దిగి వెళ్లిపోయారు. న్యాయమూర్తి భట్ మరేమీ మాట్లాడకుండా కాగితాలను సరిచేసుకుంటూ కూర్చున్నారు. 

జడ్జీలు పరస్పరం గౌరవించుకోవాలి

సుప్రీంకోర్టులోని సంప్రదాయం ప్రకారం నోటీసు ఇచ్చే విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు విభేదిస్తే నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది.  బెంచ్​ల మధ్య విభేదాలు తలెత్తడం సహజమే. అయితే,  గౌరవంగా వాటిని అధిగమించాలి. ఇక గుజరాత్​ కేసు విషయానికి వస్తే జస్టిస్​ బిరేన్ జస్టిస్​ భట్​పై అరిచినందుకు బహరంగ కోర్టులో క్షమాపణలు చెప్పారు. కథ అంతటితో  ముగిసింది. ఈ క్షమాపణ వల్ల కెమెరా ముందు నమోదైన చిత్రాలను హైకోర్టు తొలగించవచ్చేమో కానీ ప్రజలు డౌన్​లోడ్​ చేసుకున్నదాన్ని తొలగించలేరు. ఒక్క గుజరాత్ న్యాయమూర్తులే కాదు. అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం తన సహచర న్యాయమూర్తులను గౌరవించాలి. కాలం కన్ను అన్నింటిని రికార్డు చేస్తుందన్న విషయం మరవకూడదు. 

జడ్జీల వేర్వేరు తీర్పులు 

ఏదైనా అంశంలో ఉత్తర్వులు జారీ చేసేముందు న్యాయమూర్తులు ఒకరినొకరు సంప్రదించుకుంటారు. ఆ తర్వాతే ఉత్తర్వులను జారీ చేస్తారు. సాధారణంగా బెంచ్​లోని జూనియర్​ జడ్జిని ఆర్డర్​ డిక్టేట్​ చేయమని కోరితే తప్ప డిక్టేట్​ చేయరు.  ఏది ఎలా ఉన్నప్పటికీ  బెంచ్​లో జూనియర్​ న్యాయమూర్తి తన ఉత్తర్వులను జారీ చేయడాన్ని ఏదీ నిరోధించదు. 26 వారాల గర్భిణీ తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలా వద్దా అనే అంశంమీద ఆ మధ్య  సుప్రీంకోర్టు బెంచ్​ ముందుకువచ్చింది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హిమాకోహ్లీ, జస్టిస్ నాగరత్నలు బహిరంగ కోర్టులో విభేదించుకున్నారు. కోర్టు గౌరవాన్ని, వాతావరణాన్ని కాపాడుతూ వేరువేరు తీర్పులను వెలువరించారు.  తమ తీర్పులను  వేరువేరుగా వెలువరించే ముందు పరస్పరం వారు చర్చించుకున్నారు. 2016వ  సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంవై ఎక్బాల్, జస్టిస్​ అరుణ్ మిశ్రా బెంచ్​లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.  ఒక కేసులో నోటీస్ ఇవ్వాలని జస్టిస్ ఎక్బాల్​ భావించారు. జస్టిస్​ మిశ్రా దాన్ని కొట్టివేయాలని అన్నారు.  నేను మూడు సంవత్సరాలుగా బెంచ్​కి  అధ్యక్షత వహిస్తున్నానని జస్టిస్ ఎక్బాల్​ అన్నారు. సహచర జడ్జిగా  తనకూ సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్​ మిశ్రా అన్నారు.

- డా. మంగారి  రాజేందర్

జిల్లా జడ్జి (రిటైర్డ్​)