పేదల పెన్నిధి కాకా : ఏడు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా

  • ఘనంగా మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలు


నెట్​వర్క్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించగా కలెక్టరేట్లు, కార్యాలయాలతోపాటు కాంగ్రెస్​పార్టీ ఆఫీసులు, సింగరేణి కార్యాలయాలు, కుల సంఘాలు, పట్టణ, మండల కేంద్రాల్లో కాకా ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచిర్యాల కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో కలెక్టర్​కుమార్​దీపక్, కాంగ్రెస్​లీడర్లు వేర్వేరుగా పాల్గొన్నారు.​ 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాకా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, ఆయన సేవలు మరువలేనివని  కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ పోరాటం వరకు ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఏడు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగిన కాకా ప్రజాక్షేత్రంలో ఎనలేని సేవలు అందించారని అన్నారు. వెంకటస్వామి ట్రస్ట్ ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్​లో జరిగిన కాకా జయంతి వేడుకలకు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లీడర్లు తరలివెళ్లారు.

రక్తదానాలు, అన్నదానాలు, నిత్యావసరాల పంపిణీ

కాకా వెంకటస్వామి 95వ జయంతోత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల హైటెక్​ సిటీ కాలనీలోని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి నివాసంలో, చెన్నూర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో, మందమర్రిలోని సింగరేణి సీఈఆర్​క్లబ్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాంగ్రెస్​లీడర్లు, కార్యకర్తలు, కాకా అభిమానులు రక్తదానం చేశారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్​లో కాంగ్రెస్​లీడర్లు పేదలకు నిత్యావసర సరుకులు, బెల్లంపల్లిలో దుప్పట్లు  పంపిణీ చేశారు. నస్పూర్​లో వివేక్​యువసేన యూత్​ఆధ్వర్యంలో అంధులు, వృద్ధులకు అన్నదానం చేశారు.  మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల జీఎం ఆఫీసుల్లో, జీఎంలు, అధికారులు, కార్మికులు నివాళులు అర్పించారు.