బ్రెస్ట్ క్యాన్సర్​తో ఏటా 82 వేల మరణాలు ..తెలంగాణలో 3 వేలు

హైదరాబాద్, వెలుగు:   దేశంలో క్యాన్సర్‌‌ మహమ్మారి నానాటికీ విస్తరిస్తోంది. బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ వంటివి మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు హెచ్‌‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వికల్ క్యాన్సర్ వల్ల తాను చనిపోయినట్టుగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఆడిన చావు నాటకం సంచలనం సృష్టించింది. ఈ రెండు వరుస ఘటనల నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ పై జనాలు ఫోకస్ పెట్టారు. అయితే, సర్వికల్ క్యాన్సర్ కంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదకరంగా మారుతోందని, దేశంలో ఏటా వేల మంది ప్రాణాలు బలితీసుకుంటోందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గణాంకాలు  స్పష్టం చేస్తున్నాయి. గతేడాది మన దేశంలో 82,429 మంది బ్రెస్ట్ క్యాన్సర్‌‌తో ప్రాణాలొదిలినట్టు ఐసీఎంఆర్‌‌ క్యాన్సర్ రిజిస్ట్రీ విభాగం లెక్కగట్టింది. 2019 నుంచి ఏటా 2 వేల నుంచి 2,500 చొప్పున బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు పెరుగుతూ పోతున్నాయని వెల్లడించింది. 

రాష్ట్రంలో 3 వేల మరణాలు

తెలంగాణలో గడిచిన ఐదేండ్లలో(2019 నుంచి 2023 వరకు) 14,289 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించారు. ఇందులో గతేడాది అత్యధికంగా 3,001 మరణాలు నమోదయ్యాయని క్యాన్సర్ రిజిస్ట్రీ తెలిపింది. గతేడాది దేశంలో 2.21 లక్షల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే, ఇందులో మన రాష్ట్రం వాళ్లు 8,066 మంది ఉన్నారు. ఒకప్పుడు పెద్ద వయసు వారిలోనే కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్‌‌, ఇప్పుడు అన్ని వయసుల వారికీ వస్తోంది. గతేడాది నమోదైన బ్రెస్ట్ క్యాన్సర్ మృతుల్లో 17 శాతం మంది 40 ఏండ్ల కంటే తక్కువ వయసు వాళ్లే ఉన్నారు. ఇంత తక్కువ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ సోకి, చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.  

వీరికి ముప్పు ఎక్కువ.. 

కుటుంబసభ్యుల్లో ఎవరికైనా గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే, వారి కుటుంబ సభ్యులకు (మహిళలు) కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువ భాగం 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న మహిళలే ఉంటున్నారు. అందుకే 35 ఏండ్ల దాటిన తర్వాత కనీసం రెండేండ్లకోసారి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు‌‌. 12 ఏండ్ల కంటే ముందే మెచ్యూర్డ్(పీరియడ్స్ మొదలవడం) అయినవారికి, 55 ఏండ్ల తర్వాత మెనోపాజ్ (పీరియడ్స్ ఆగిపోవడం) వచ్చిన మహిళలకు, లేదంటే పిల్లలు కనని మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది. అధిక కొవ్వు ఉన్న ఆహారంతో కూడా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పొగాకు లేదా మద్యం సేవించడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. 

బ్రెస్ట్ క్యాన్సర్ సింప్టమ్స్ ఇవే.. 

రొమ్ములో నొప్పి లేని లంప్స్ ఏర్పడడం, రొమ్ముపై చర్మం మసకబారడం, చనుమొనలపై దద్దుర్లు లేదా పుండు రావడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలుగా డాక్టర్లు చెప్తున్నారు. చనుమొనల గుండా రక్తపు మరకలతో కూడిన ఫ్లూయిడ్స్ డిశ్చార్జ్ కావడం, చంకలో లంప్స్ ఏర్పడడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సింప్టమ్స్ కావచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలేవైనా కన్పిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.  కాగా, బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఫైన్ నీడిల్ అస్పిరేషన్ సైటాలజీ(ఎఫ్‌‌ఎన్‌‌ఏసీ), మమ్మోగ్రఫీ, ఎక్స్‌‌-రే, అబ్డామినల్ సోనోగ్రఫీ, బోన్ స్కాన్, పెట్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తిస్తారు.