రోజూ16 గంటల ఉపాసం..గుండెకు డేంజర్

  • ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే..గుండెజబ్బుతో చనిపోయే ముప్పు 91% ఎక్కువ 
  •     గుండెజబ్బు, క్యాన్సర్ ఉండి.. పస్తులుంటే మరింత రిస్క్ 
  •     16 గంటల ఉపాసంతో ప్రయోజనాలు తాత్కాలికమే  
  •     రోజూ 8 నుంచి 12 గంటలు పస్తులుంటే ఓకే
  •     అమెరికాలో 20 వేల మందిపై జరిగిన స్టడీలో వెల్లడి

షికాగో : రోజూ 8 గంటల నిడివిలోనే తిండి తిని, ఆ తర్వాత 16 గంటల పాటు ఉపాసం ఉంటే.. బరువు వేగంగా తగ్గొచ్చని, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని ఇదివరకే అనేక రీసెర్చ్ లలో తేలింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేండ్లుగా మస్త్ పాపులర్ కూడా అయింది. కానీ ఇలా 16 గంటల ఉపాసం పద్ధతిని పాటించేవాళ్లు దీర్ఘకాలంలో గుండె జబ్బులతో చనిపోయే ముప్పు ఏకంగా 91% పెరుగుతుందని తాజాగా అమెరికాలోని షికాగోలో జరిగిన ఓ స్టడీలో వెల్లడైంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది తప్ప.. దీర్ఘకాలంలో గుండెజబ్బులు, క్యాన్సర్, ఇతర కారణాలతో చనిపోయే ముప్పును మాత్రం పెంచుతుందని తాజా రీసెర్చ్ లో పాల్గొన్న పలువురు సైంటిస్టులు హెచ్చరించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘‘ఎపిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్– లైఫ్ స్టైల్ అండ్ కార్డియోమెటబాలిక్ సైంటిఫిక్ సెషన్స్–2024” పేరుతో  సోమవారం షికాగోలో ప్రారంభమైన మూడు రోజుల సదస్సులో ఈ మేరకు తాజా స్టడీ పేపర్ ను సమర్పించారు. 16 గంటల ఉపాసం పద్ధతి ఏ రకంగానూ చనిపోయే ముప్పును తగ్గించలేదని తమ ప్రిలిమినరీ స్టడీలో తేలినట్టు సైంటిస్టులు స్పష్టం చేశారు. ఒక రోజులో 12 నుంచి 16 గంటల నిడివిలో తిని.. 12 నుంచి 8 గంటలు ఉపాసం ఉండేవారికి మాత్రం రిస్క్ తక్కువగా ఉంటుందని తమ స్టడీలో తేలిందన్నారు.  

20 వేల మందిపై స్టడీ..

అమెరికాలో యావరేజ్ గా 49 ఏండ్ల వయసు ఉన్న 20 వేల మందిపై ఈ స్టడీ నిర్వహించారు. స్టడీలో పాల్గొన్న వ్యక్తులపై కనీసం 8 ఏండ్ల నుంచి గరిష్టంగా 17 ఏండ్లపాటు అధ్యయనం చేశారు. వారి తిండి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, ఒక అంచనాకు వచ్చారు. అలాగే 2003 నుంచి 2018 మధ్య నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలలో పాల్గొన్న వ్యక్తుల డేటాను కూడా ఈ స్టడీలో పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో సగం మంది పురుషులు, సగం మంది మహిళలు ఉన్నారు. 
మొదటి ఏడాది తర్వాత వీరందరి నుంచీ రోజువారీ తిండి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితి వివరాలను సేకరించి, విశ్లేషించారు. 

ఇంకా రీసెర్చ్ జరగాలి.. 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై తాము ప్రైమరీ రీసెర్చ్ మా త్రమే నిర్వహించి, స్టడీ పేపర్ సమర్పించామని సైంటిస్టులు స్పష్టం చేశారు. 16 గంటల ఉపాసం పద్ధతితో దీర్ఘకాలంలో ప్రయోజనాలు శూన్యమని తేలినప్పటికీ, తమ స్టడీకి కొన్ని పరిమితులు అయితే ఉన్నాయని తెలిపారు. కేవలం వాలంటీర్ల తిండి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితి వివరాలను వారి నుంచే అడిగి తెలుసుకుని ఈ రిపోర్ట్ ను సిద్ధం చేశామన్నారు. స్టడీలో పాల్గొన్న వాలంటీర్లు కొన్ని విషయాలు మరచిపోయి తప్పుగా చెప్పి ఉండొచ్చని, అందువల్ల డేటా పూర్తిస్థాయిలో కచ్చితత్వంతో ఉండకపోవచ్చన్నారు. ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో తాత్కాలిక ప్రయోజనాలే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండకపోవచ్చన్నది మాత్రమే మా స్టడీ ప్రాథమికంగా చెప్తోంది. అందుకే స్టడీలో తేలిన అంశాలపై మరింత విస్తృత స్థాయిలో రీసెర్చ్ చేస్తేనే కచ్చితమైన వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషక విలువలు, ఇతర విషయాలను బట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై మరింత విస్తృత స్థాయిలో రీసెర్చ్ జరగాలి” అని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ డి. గార్డెనర్ స్పష్టం చేశారు.

దీర్ఘకాల ప్రయోజనాలు డౌటే.. 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానంలో కొందరు 4 నుంచి 12 గంటల నిడివిలో తిండి తిని, మిగతా సమయం ఉపాసం ఉంటున్నారు. వీరిలో అత్యధిక మంది 8 గంటల్లో తిని, 16 గంటలు పస్తులు ఉంటున్నారని రీసెర్చర్లు తెలిపారు. ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో గుండె మెటబాలిజం, ఆరోగ్యం మెరుగుపడుతుందని, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయని ఇదివరకు జరిగిన పలు స్టడీల్లో తేలింది. అందుకే బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యం పెంచుకోవడం కోసమని రోజులో తిండి సమయాన్ని 8 గంటలకు కుదించుకునే విధానం కొన్నేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కానీ దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ తో చనిపోయే ముప్పు ఏ మాత్రం తగ్గుతుందని చెప్పలేం” అని స్టడీలో పాల్గొన్న సీనియర్ ఆథర్, చైనాలోని షాంఘై జావో టాంగ్ యూనివర్సిటీ సైంటిస్ట్ విక్టర్ వెంజ్ ఝాంగ్ పేర్కొన్నారు. 

స్టడీలో ఏం తేలిందంటే.. 

  •     రోజులో 8 గంటల నిడివిలోపే తిండి తింటున్న వారికి గుండె సమస్యలతో చనిపోయే ముప్పు 91% పెరిగే చాన్స్​ఉంది. 
  •     ఇదివరకే గుండెజబ్బు లేదా క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి గుండె సంబంధమైన సమస్యతో చనిపోయే ముప్పు మరింతగా పెరుగుతుంది. 
  •     గుండెజబ్బులు ఉండి, రోజుకు 8 నుంచి 10 గంటల నిడివిలో తిని, మిగతా సమయం ఉపాసం ఉంటున్నవారికి కూడా హార్ట్ డిసీజ్ లేదా స్ట్రోక్ తో చనిపోయే ముప్పు 66% అధికంగా ఉంటుంది. 
  •     ఇతర ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఏమాత్రం తగ్గే చాన్స్ లేదు. 
  •     క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులు రోజుకు 16 గంటల కంటే ఎక్కువ నిడివిలో తిండి తింటే.. క్యాన్సర్ తో చనిపోయే రిస్క్ తక్కువగా ఉంటుంది. 
  •     ఒక రోజులో 12 నుంచి 16 గంటల నిడివిలో తిని.. 12 నుంచి 8 గంటలు ఉపాసం ఉండేవారి గుండెకు మాత్రం రిస్క్ తక్కువగా ఉంటుంది.