హైదరాబాద్​లో ఘనంగా ఇండిపెండెన్స్ ​డే సెలబ్రేషన్స్

  •      ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం స్వాతంత్ర్యం
  •      జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో జాతీయ జెండాను ఎగరవేసిన మేయర్​
  •      ఆకట్టుకున్న స్కూల్​స్టూడెంట్ల సాంస్కృతిక ప్రదర్శనలు

హైదరాబాద్/సికింద్రాబాద్/మేడ్చల్ కలెక్టరేట్/ముషీరాబాద్/ఖైరతాబాద్/వికారాబాద్/బషీర్​బాగ్, వెలుగు : గ్రేటర్ పరిధిలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్​జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, పొలిటికల్​పార్టీ ఆఫీసులతోపాటు వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు తమ ప్రదర్శనలతో అబ్బురపరిచారు.

జిల్లాను అన్ని విధాల డెవలప్ చేస్తున్నాం : హైదరాబాద్​ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగధనుల పోరాటానికి ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వాతంత్ర్య యోధులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. హైదరాబాద్​జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. ఉత్తమ అధికారుల పని తీరును ప్రస్తావించారు. జిల్లాలోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

అలాగే నెహ్రూ జూలాజికల్ పార్కులో క్యూరేటర్ సునీల్.ఎస్.హిరేమత్​ జాతీయ జెండాను ఎగరవేశారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫీల్డ్ ఆఫీసర్ల కోసం నాలుగు ఈ– బైక్స్ ను ప్రారంభించారు. రసూల్​పురాలోని మెట్రో రైల్ ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో మెట్రో ఫేజ్–2  ముఖ్యమైనదని చెప్పారు. త్వరలో డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేశారు.

ద.మ.రైల్వే ఆదాయం 3% పెరిగింది : జీఎం

సికింద్రాబాద్​లోని ఆర్ఆర్సీ గ్రౌండ్​లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. రైల్వే పోలీస్​సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్​పరిధిలో సాధించిన విజయాలను తెలియజేశారు. ఏప్రిల్​నుంచి జులై వరకు దక్షిణ మధ్య రైల్వేకు రూ.6,894 కోట్ల ఆదాయం సమకూరిందని, గతేడాదితో పోలిస్తే 3 శాతం పెరిగిందని తెలిపారు. 251 కిలోమీటర్ల మేరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేశామని వెల్లడించారు.

‘కవచ్’ విస్తరణలో భాగంగా వాడి, గుంతకల్, రేణిగుంట మధ్య 523 కి.మీ పనులకు టెండర్లు పిలిచామన్నారు. రైల్వే రక్షణ దళం 503 మంది చిన్నారులను రక్షించారని, చోరీకి గురైన రూ.కోటి వస్తువులను రికవరీ చేశారని, ప్రయాణికులు పోగొట్టుకున్న రూ.2 కోట్ల సామాన్లను తిరగి అప్పగించారని తెలియజేశారు. ప్రయాణీకుల సౌకర్యార్థం 271 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు స్పష్టం చేశారు. జోన్ లోని 7 స్టేషన్లలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించామని తెలిపారు. వేడుకల్లో రైల్వే సీనియర్ అధికారులు

సిబ్బంది కుటుంబ సభ్యులు, రైల్వే స్కూల్, కాలేజీల స్టూడెంట్లు పాల్గొన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు తమ ప్రదర్శనలతో వీక్షకులను కట్టిపడేశారు. అలాగే ఇండియన్​ఇనిస్టిట్యూట్ ఆఫ్​ఫైనాన్స్​మేనేజ్​మెంట్, మౌలాలిలోని రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​, మెట్టుగూడలోని ఇరిసెట్, లాలాగూడ క్యారేజీ వర్క్​షాపుల్లో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సక్రమంగా డ్యూటీ చేస్తే దేశ సేవ చేసినట్టే

హెచ్ఎండీఏ హెడ్డాఫీసులో కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలతో స్వాతంత్ర్యం దక్కిందన్నారు. ప్రతిఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే దేశ సేవ చేసినట్టేనన్నారు. జెండా వందనంలో అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ ప్రదీప్ కుమార్ శెట్టి, హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి, ప్లానింగ్​ డైరెక్టర్లు విద్యాధర్, రాజేంద్రప్రసాద్ నాయిక్, ఎస్టేట్​ఆఫీసర్​ వీరా రెడ్డి, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్​ ఓఎస్డీ చంద్రారెడ్డి, ఉమ్టా ఎండీ జీవన్ బాబు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

వాటర్​ బోర్డులో..

వాటర్​బోర్డు హెడ్డాఫీసులో నిర్వహించిన వేడుకల్లో ఎండీ అశోక్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి బోర్డు ప్రతిష్టను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. బోర్డు పరిధిలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్

డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, సీజీఎంలు, యునియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్, అడిషనల్​ఎస్పీ(ఐఎస్​డబ్ల్యూ) చెరుకు వాసుదేవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్​పోలీస్​మెడల్​అందుకున్నారు. గోల్కొండ కోటలో మెడల్​అందజేసి రేవంత్ రెడ్డి వాసుదేవరెడ్డిని అభినందించారు. 

మేడ్చల్​ కలెక్టరేట్​లో.. 

మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ గౌతమ్ పోట్రుతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా స్కూల్ స్టూడెంట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్​గౌతమ్​మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అడిషనల్​కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, రాధిక గుప్తా, డీసీపీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామ క్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం స్వామి బోధమయానంద

కామ క్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రామకృష్ణ మఠంలో నిర్వహించిన లవ్ ఇండియా– సర్వ్ ఇండియా కార్యక్రమంలో బోధమయానంద ప్రసంగించారు. కామాన్ని జ్ఞానమనే ఖడ్గంతో జయించాలన్నారు. ముఖ్య అతిథిగా మాజీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పాల్గొని మాట్లాడారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు. కమిషనర్ ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డితో కలిసి పోలీస్​వందనం స్వీకరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశయాలు నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీని ఆదుకోవడానికి సీఎం రేవంత్​రెడ్డి అధికారంలోకి రాగానే రూ.1,100 కోట్లు, బడ్జెట్​లో రూ.3,065 కోట్లను కేటాయించారని తెలిపారు.

పెద్ద మొత్తంలో బల్దియాకు నిధులు కేటాయించినందుకు కృజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ అగర్వాల్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, కె.శ్రీనివాసరావు, శివకుమార్ నాయుడు, యాదగిరిరావు, సత్యనారాయణ, నళిని పద్మావతి, గీతా రాధిక, సరోజ, పంకజ, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.