పాలమూరులో పంద్రాగస్టు సంబురాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంబురంగా జరుపుకున్నారు. ఊరూవాడా జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని, వారికి నివాళులు అర్పించారు. వారి ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు.

సమస్యల పరిష్కారంలో ముందున్నాం

గద్వాల: కాంగ్రెస్  ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో ముందుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల పోలీస్  పరేడ్  గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అభయ హస్తం హామీలను అమలు చేయడం ప్రారంభించిందన్నారు. గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఆడపడుచులు, ట్రాన్స్  జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని

జిల్లాలో 86.32 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో 87,751 మందికి రూ.500కే గ్యాస్​ సిలిండర్​ అందిస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి కింద 1, 40, 440 జీరో బిల్లులు జారీ చేశామని, 76,358 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. జిల్లాలో 41,638 మంది రైతులకు రూ.318.83 కోట్లు రుణమాఫీ ద్వారా డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఆఫీసర్లకు  ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపీ మల్లు రవి, కలెక్టర్  సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు పాల్గొన్నారు.

పారదర్శకంగా ప్రజా పాలన

పాలమూరు: ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహబూబ్ నగర్  పోలీస్  పరేడ్  గ్రౌండ్​లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కే గ్యాస్  సిలిండర్, గృహజ్యోతి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 624 పాఠశాలల్లో పనులు చేశామన్నారు.

రుణమాఫీతో ఎన్నో ఏండ్లుగా బ్యాంకు రుణాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు రుణ విముక్తి కలిగించామని తెలిపారు. జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎంపీ డీకే అరుణ, కలెక్టర్  విజయేందిర బోయి, ఎస్పీ  జానకి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు 

జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

వనపర్తి: జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని రాష్ట్ర ఎస్సీ డెవలప్​మెంట్ ​కార్పొరేషన్​ లిమిటెడ్​ చైర్మన్​ ఎన్. ప్రీతం పిలుపునిచ్చారు. కలెక్టరేట్​ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పోలీస్​ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంతో పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మిస్తామన్నారు.

జిల్లాలో 74,918 మందికి రూ.500కే వంట గ్యాస్​ సప్లై చేస్తున్నామని తెలిపారు.  73,475 మందికి జీరో బిల్లులు జారీ చేశామని, రుణమాఫీ కింద 41,780 మంది రైతులకు రూ.28.30 కోట్లు మాఫీ చేశామన్నారు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 4.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం  స్వాతంత్ర్య సమరయోధుడు బలరాం భార్య సీతమ్మను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు  సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్, ఎస్పీ రావుల గిరిధర్​ పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదాం

నారాయణపేట : జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పునరంకితం కావాలని పోలీస్  హౌసింగ్  కార్పొరేషన్  లిమిటెడ్  చైర్మన్  ఆర్. గుర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్  పరేడ్  గ్రౌండ్​లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేశ్ గౌతమ్ తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్​ సిలిండర్లు, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్  అందిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ కింద 46,564 మంది రైతులకు రూ. 348.17 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి

నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచుతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి తెలిపారు. పోలీస్  పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్సీ గైక్వాడ్​ వైభవ్​ రఘునాథ్, ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి పాల్గొన్నారు.