పాలమూరులో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

  •     2019 తర్వాత పెరిగిన పోలింగ్ శాతం
  •     ఇంట్రెస్ట్​చూపని మహిళా ఓటర్లు
  •     అన్ని అసెంబ్లీల్లో క్రాస్​ ఓటింగ్

మహబూబ్​నగర్, వెలుగు: హోరాహోరీగా సాగిన లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్​​నగర్​ పార్లమెంట్​లో  72.43 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 16,82,470 మంది ఓటర్లకు గాను సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,18,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పార్లమెంట్​ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​పర్సంటేజ్​7.12 శాతం పెరిగింది. అయితే, పెరిగిన ఓటింగ్​శాతం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు దాదాపు మూడు వారాల టైమ్ ఉండడంతో క్యాండిడేట్లలో టెన్షన్​ నెలకొంది.

ఆసక్తి చూపని మహిళలు

పార్లమెంట్​పరిధిలో మొత్తం మహిళా ఓటర్లు 8,50,172 మంది ఉన్నారు. పురుషుల కంటే వీరు 17,916 మంది అధికంగా ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవడంలో వెనుక పడ్డారు. మొత్తం 6,12,924 మంది (73,65 శాతం) పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా,  6,05,647 మంది (71,24 శాతం) మహిళలే ఓటు వేశారు. ఈ లెక్క ప్రకారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,44,525 మంది మహిళలు ఓటు వేయలేదని స్పష్టం అవుతోంది.

పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్

2019 తర్వాత పాలమూరు లోక్​సభ స్థానంలో ఓటింగ్​పర్సంటేజ్​పెరిగింది. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓడింగ్​శాతం పెరుగుతున్నా.. పార్లమెంట్​ ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్​ పర్సంటేజి​ తగ్గిపోతోంది. ఈసారి మాత్రం కొంత మెరుగైంది. 2004 పార్లమెంట్​కు జరిగిన  ఎన్నికల్లో 63.46 శాతం, 2009లో 67.68, 2014లో 72.94, 2019లో 65.31 శాతం ఓట్లు పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ 72.4 3 శాతంగా నమోదైంది.  

క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టాక్

మహబూబ్ నగర్ పార్లమెంట్​లో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఓ జాతీయ పార్టీకి రాష్ర్టానికి చెందిన ప్రాంతీయ పార్టీ లీడర్లు సపోర్ట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ క్యాండిడేట్ కు కాకుండా జాతీయ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారనే టాక్ ఉంది. ఆ పార్టీ ఓట్లను గంప గుత్తగా వేయించారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మక్తల్, నర్వ, ఊట్కూరు, మరికల్,  దామరగిద్ద, కృష్ణా, నారాయణపేట, దేవరకద్ర, చిన్నచింతకుంట, బాలానగర్, రాజాపూర్, కొత్తకోట, మహబూబ్​ నగర్ టౌన్, రూరల్, జడ్చర్ల టౌన్, షాద్నగర్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.