స్టేట్ వర్సిటీల్లో 70 శాతం పోస్టులు ఖాళీ

  •     వాటిని భర్తీ చేస్తేనే నాణ్యమైన విద్య 
  •     యూజీసీ చైర్మన్  జగదీశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: దేశంలోని స్టేట్ యూనివర్సిటీల్లో సుమారు 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అసవరం ఉందని యూజీసీ చైర్మన్  ప్రొఫెసర్  జగదీశ్  అన్నారు. రాష్ట్ర వర్సిటీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో  ఫిక్కీ, హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్  ఎడ్యుకేషన్  సిస్టమ్’  అంశంపై సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. ‘‘దేశంలో 4.3 కోట్ల మంది విద్యార్థులు హయ్యర్  ఎడ్యుకేషన్  చదువుతున్నారు. విద్యావ్యవస్థకు పునాది టీచర్లే. మారుతున్న కాలానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. స్కూల్  నుంచి ఉన్నత విద్య వరకు అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

 దేశంలో 1150 వర్సిటీలు ఉండగా, వాటిలో 85  వర్సిటీలు ఓడీఎల్, ఆన్‌‌‌‌లైన్  ప్రోగ్రామ్‌‌‌‌లను అందిస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇతర వర్సిటీలు ఆన్​లైన్  విద్యను అందించాలి. దేశంలో 60 శాతం కాలేజీలు, 45 శాతం వర్సిటీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి” అని జగదీశ్  వెల్లడించారు. కార్యక్రమంలో విద్యా శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్  ప్రొఫెసర్  లింబాద్రి, కాలేజీ   విద్యా శాఖ కమిషనర్  శ్రీదేవసేన, డాక్టర్  బీవీఆర్ మోహన్  రెడ్డి, ప్రొఫెసర్  సుధాకర్  రెడ్డి మాట్లాడారు.