వానల్లేవ్ .. కామారెడ్డి జిల్లాలో లోటు వర్షపాతం

  • కామారెడ్డి జిల్లాలో లోటు  వర్షపాతం
  • వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు 
  • కామారెడ్డి జిల్లాలో ని  7 మండలాల్లో  జూన్ లో తక్కువ వానలు
  • 13 మండలాల్లో సాధారణ వర్షపాతం 
  • పూర్తి స్థాయిలో సాగు కాని పంటలు    

కామారెడ్డి, వెలుగు: వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఒక్క భారీ వర్షం కురవలేదు. కామారెడ్డి జిల్లాలో  జూన్ నెలలో  7 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. 13 మండలాల్లో సాధారణం, మరో నాలుగు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.  ఆశించిన మేర వానలు పడకపోవడంతో  పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. సగం కంటే ఎక్కువ మండలాల్లో పూర్తి స్థాయిలో పంటల సాగు కాలేదు.  సీజన్​ మొదట్లో కురిసిన కొద్ది పాటి వర్షానికి రైతులు విత్తనాలు వేసినా అవి కంప్లీట్​గా మొలకెత్తలేదు. 

మండలాల్లో పరిస్థితి

నాగిరెడ్డిపేట, బిచ్కుంద, తాడ్వాయి, నస్రుల్లాబాద్​ మండలాల్లో నార్మల్​ కంటే 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.   మరో 13 మండలాల్లో మాత్రం నార్మల్​ వర్షం పడింది. కామారెడ్డి, దోమకొండ, బీబీపేట, ఎల్లారెడ్డి, పిట్లం, పెద్దకొడప్​గల్​,  నిజాంసాగర్​ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.  లోటు వర్షపాతంతో పాటు, నార్మల్​వర్షపాతం నమోదైన మండలాల్లో   రైతులు వేసిన విత్తనాలు ఇంకా పూర్తి స్థాయిలో మొలకెత్తలేదు. మక్క, సోయా, పత్తి, పప్పు దినుసుల పంటలు వేశారు.  కొందరు రైతులయితే ఇప్పటికే  రెండో సారి మక్క విత్తనం కూడా వేశారు.  

చెలక, ఎర్ర నేలల్లో ఇంకా విత్తనాలు వేయలేదు.  పెద్ద వానలు కురుస్తాయనే ఆశతో ప్రతి రోజు ఎదురు చూస్తున్నారు.  వరి నారు మడులు కూడా పూర్థి స్థాయిలో రెడీ కాలేదు. బోర్లలో కూడా నీటి ధారలు పెద్దగా రావట్లేదు. ఈ సీజన్లో 5.20 లక్షల ఎకరాల్లో  పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  వరి 3,13,965 ఎకరాలు,  సోయా 85,444 ఎకరాలు, మక్క 57,315 ఎకరాలు, పత్తి 28,730 ఎకరాలు, కంది 13, 961 ఎకరాలు, పెసర 4,997 ఎకరాలు,  మినుము 5,263 ఎకరాలు  ఉన్నాయి.   ఇప్పటి వరకు 40 శాతం మేర పంటలు సాగయ్యాయి.

  విత్తనాలు వేసిన మక్క, పత్తి, సోయా విత్తనాలు ఇంకా పూర్తి స్థాయిలో మొలకెత్తలేదు.  కామారెడ్డి, సదాశివనగర్,  రామారెడ్డి,  దోమకొండ, బీబీపేట మండలాల్లో మక్క, సోయా, పత్తి  విత్తనాలు ఇంకా పూర్తి స్థాయిలో మొలకెత్తలేదు.  వరి నారు మళ్లు కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో రెడీ చేయలేదు.   భారీ వానలు లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌ లో తాగునీటి కష్టాలు

కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌ లో తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి.  భారీ వర్షాలు కురియకపోవటంలో బోర్లలో నీటి ధారలు రావట్లేదు. ఎండాకాలంలోనే టౌన్‌‌‌‌‌‌‌‌ లోని పలు ఏరియాల్లో బోర్లు వట్టిపోయాయి.  మిషన్​ భగీరథ ద్వారా కూడా నీటి సప్లయ్​ 3 లేదా 4 రోజులకు ఒక సారి సప్లయ్​ చేస్తున్నారు.   పలు కాలనీల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆశోక్​నగర్​, కాకతీయనగర్​, ఎన్జీవోస్​కాలనీ, విద్యానగర్​,  దేవునిపల్లి ఏరియాల్లో  బోర్లలో నీటి ధారలు పూర్తిగా తగ్గిపోయాయి.

వానకోసం ఎదురు చూపులు

మా ఏరియాలో పెద్ద వాన పడలేదు.  ప్రతి రోజు వానకోసం ఎదురు చూస్తున్నాం.   మా భూములు ఎర్ర, చెలక నేలలు.  పెద్ద వాన వస్తే విత్తనాలు వేద్దామని ఎదురు చూస్తున్నాం.   పెద్ద వాన రాకపోతే విత్తనం మొలకరాదు.  జులై వచ్చినా పెద్ద వానలు పడట్లేదు.

ఇస్లావత్​ సర్వాన్​, క్యాసంపల్లితండా