ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో 7 లక్షల రష్యాన్ సైనికులు మృతి

ఉక్రెయిన్​పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం వల్ల ఇప్పటి వరకు రష్యా సైన్యం భారీగా ప్రాణనష్టాన్ని ఎదుర్కొంది. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ వార్​తో ఇప్పటివరకు 7 లక్షల మంది రష్యా సైనికులు మృతి చెందారని బ్రిటన్​ రక్షణ విభాగం ప్రకటించింది. యుద్ధం స్టార్టయినప్పటి నుంచి చూస్తే  గత నెల అక్టోబర్​లో ఈ సంఖ్య భారీగా ఉందని తెలిపింది.

మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. తాజాగా ఆదివారం రష్యాపైకి ఉక్రెయిన్​ ప్రతీకార దాడికి దిగింది. రష్యా రాజధాని మాస్కోకు సమీపంలోని పలు ప్రాంతాలపై 34 డ్రోన్లతో అటాక్​ చేసింది. ఈ విషయాన్ని రష్యా అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్​ దాడులు వల్ల మాస్కో సమీప జిల్లాలైన రామెన్​స్కోయ్​, కొలోమెనెస్కీలో పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డవారిని హాస్పిటల్​కు తరలించామన్నారు. 

ఉక్రెయిన్​ దాడుల కారణంగా మాస్కోలోని డొమోడెడోవో, షెరెమెట్యోవో ఎయిర్​పోర్టులను తాత్కాలికంగా మూసివేశామని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వారు పేర్కొన్నారు. కాగా, రెండేండ్లుగా ఉక్రెయిన్​పై రష్యా దాడులతో విరుచుకుపడుతున్నది. రెండురోజుల కింద 145 డ్రోన్లతో రష్యా దాడులకు తెగబడిందని ఉక్రెయిన్​ చెప్తున్నది. ప్రతీకారంగా తాజాగా ఉక్రెయిన్​ అటాక్​ చేసినట్లు తెలుస్తున్నది.