- బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై ఫైరింగ్
- డ్రైవర్‌తో పాటు మరో కార్యకర్తకు గాయాలు
- రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
కోల్‌కతా: ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించిన స్టూడెంట్లపై పోలీసులు మంగళవారం లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా బీజేపీ నేతలు బుధవారం చేపట్టిన 12 గంటల ‘బెంగాల్ బంద్’ హింసాత్మకంగా మారింది. బాంబు దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లాలోని భట్పారాలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తర్వాత బాంబు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనలో పాండే సేఫ్‌గా బయటపడ్డారు. డ్రైవర్‌తో పాటు మరో కార్యకర్తకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించారు. బాంబు దాడులు, కాల్పులు జరిపింది టీఎంసీ గూండాలేనని ప్రియాంగు పాండే ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పలుచోట్ల టీఎంసీ, బీజేపీ నేతలు పరస్పర దాడులకు దిగారు.
దుకాణాలు మూసివేయించిన బీజేపీ లీడర్లు
బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల బెంగాల్ బంద్ సందర్భంగా బీజేపీ లీడర్లు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ ఎంపీ సామిక్ భట్టాచార్య, ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు రోడ్లు బ్లాక్ చేశారు. ‘ఛాత్ర సమాజ్’ యూనియన్ నేతలు శాంతియుతంగా చలో సెక్రటేరియెట్ చేపడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. స్టూడెంట్లపై లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బెంగాల్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కోల్‌కతాలో పలుచోట్ల బీజేపీ నేతలు దుకాణాలను మూసివేయిస్తూ ఆందోళన చేపట్టారు. రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు చాలా తక్కువ నడిచాయి. కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా తెరిచే ఉన్నాయి. ప్రైవేట్, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగులు తక్కువగా కనిపించారు.
హెల్మెట్లు పెట్టుకుని బస్ డ్రైవింగ్
‘బంగ్లా బంద్’ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపా రు. బస్సులపై దాడులు జరిగితే తమ సిబ్బందికి ఏంకావొద్దనే ఆలోచనతోనే హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహించాల్సిందిగా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించామని నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కూచ్ బెహర్‌లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవర్లు బస్సులు నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సందీప్ ఘోష్‌ను సస్పెండ్ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం ప్రకటించింది. సందీప్ ఘోష్ తన చర్యలతో వైద్య వృత్తికి చెడ్డపేరు తెచ్చారని ఐఎంఏ పేర్కొంది. క్రమశిక్షణ కమిటీ అతడిని జాతీయ వైద్య సంఘం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని తెలిపింది. ‘‘మృతురాలి తల్లిదండ్రులను సంజయ్ ఘోష్ మనోవేదనకు గురి చేశారు. ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. హాస్పిటల్, కాలేజ్ ఆర్థిక వ్యవహారాల్లోనూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే సభ్యత్వం రద్దు చేస్తున్నం’’ అని ఐఎంఏ పేర్కొంది.
16 రోజులైంది.. ఎక్కడ మీ న్యాయం?: మమతా బెనర్జీ
ట్రైయినీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగించి 16 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటి దాకా ఏంచేస్తోందని సీబీఐపై మండిపడ్డారు. విచారణ కోసం తాము ఐదు రోజుల టైమ్ అడిగితే ఇవ్వలేదని గుర్తుచేశారు. బాధిత కుటుం బానికి సత్వర న్యాయం అందించాలనే ఆలోచన సీబీఐకి లేదని ఫైర్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకు ని ఆమె మాట్లాడారు. ‘‘ఈ కేసు విచారణను సీబీఐ కావాలనే ఆలస్యం చేస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశం నిర్వహించి రేపిస్టులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లు పెడ్తం. అత్యాచార వ్యతిరేక చట్టాలకు సంబంధించి బిల్లుల్ని ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తం. ఆయన ఆమోదించకుంటే రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తం’’ అని మమత చెప్పారు.