ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ప్రతీ పది ఫ్యామిలీల్లో ఏడింటిపై ఎఫెక్ట్​

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఢిల్లీ–ఎన్​సీఆర్ పరిధిలో ఉన్న 69 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు గొంతు నొప్పి, తీవ్ర దగ్గు, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీపావళి రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) రీడింగ్ పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 999గా నమోదైంది. ప్రతీ 10 కుటుంబాల్లో 7 కుటుంబాల్లో కనీసం ఒకరు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ జరిపిన సర్వేలో వెల్లడైంది.

డిజిటల్ ప్లాట్​ఫామ్ వేదికగా 21వేల మంది ఢిల్లీ వాసుల అభిప్రాయాలను ‘లోకల్ సర్కిల్స్’ సేకరించింది. చాలా మంది గాలి కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో కండ్లల్లో మంట, వాపు, కండ్లు ఎర్రబడటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, దీపావళి రోజుతో పోలిస్తే ఎయిర్ క్వాలిటీ కొంత మెరుగుపడినట్లు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్​క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ (సఫర్) తెలిపింది.

అస్తమా, తలనొప్పితో ఇబ్బందులు
‘లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం.. 31% మంది శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్తమా లాంటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో 31% మంది తీవ్రమైన తలనొప్పితో సతమతం అవుతున్నారు. సుమారు 23% మంది ఆందోళన లేదా ఏకాగ్రత వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15% మందికి కంటి నిండా నిద్ర కరువవుతున్నది. అయితే, తమ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం లేదని  31% మంది సూచించారు.

మరికొన్ని వారాల్లో రెట్టింపు వాయు కాలుష్యం
ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 నుంచి 500 రేంజ్​లో ఉన్నది. రానున్న మరికొన్ని వారాల్లో ఇది రెట్టింపు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం నుంచి తమను తాము ఎలా రక్షించుకుంటారని ప్రశ్నించగా.. 10,630 మందిలో 15 శాతం మంది.. కొన్ని వారాల పాటు ఢిల్లీని వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారు.

9 శాతం మంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెడ్తామన్నారు. మరో 23% మంది ఇండోర్‌‌‌‌తో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్‌‌‌‌లను ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. బయటికెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరిస్తామని మరికొంత మంది తెలిపారు. అయితే, ఢిల్లీ జనాభాలో ఎక్కువ మంది గాలి కాలుష్యాన్ని  భరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు.