పంటలన్నీ ఆగం .. ఇంకా పొలాలను వీడని నీళ్లు..

  • పంటనష్టం మరింత పెరిగే అవకాం!
  • ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • నష్టపోయిన 7,500 ఇండ్లలో హౌస్​ హోల్డ్ సర్వే

ఖమ్మం, కూసుమంచి/ ఎర్రుపాలెం/ ఖమ్మం రూరల్​/ వెలుగు: ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లోని పంట పొలాలు ఇంకా చాలా వరకు వరద నీటిలోనే ఉన్నాయి. నాలుగైదు రోజుల నుంచి పత్తి, మిరప తోటల్లో నీళ్లు నిలిచి ఉండడంతో మొక్కలు ఎరుపు రంగులోకి మారి పాడవుతున్నాయి. బుధవారం వరకు ఖమ్మం జిల్లాలో 68 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

వాగులు, చెరువుల అలుగు పారే ప్రాంతాల్లో ఇప్పటికీ వరి పొలాల్లో ఇసుక మేటలున్నాయి. దీంతో ఈ వ్యవసాయ సీజన్​ లో పంటను నష్టపోయినట్టేనని రైతులు వాపోతున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల వర్షాల కారణంగా ఆస్తి నష్టం జరిగింది. ఖమ్మం పట్టణంతో పాటు 72 గ్రామాల్లో 49,364 మంది ప్రజలు నష్టపోయారు. ఇందులో పంట పొలాలు, ఇండ్లతో పాటు పశువులు, మూగజీవాలు నష్టపోయినవారున్నారు. వందల సంఖ్యలో గొర్రెలు, బర్రెలు, మేకలు, కోళ్లు వరదల్లో కొట్టుకుపోయినట్టు బాధితులు చెబుతున్నారు. 

కొనసాగుతున్న సహాయక చర్యలు 

ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్​ లో 13 డివిజన్లలో నష్టం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్​ లోని శానిటేషన్​ సిబ్బంది 704 మంది ఉండగా, సమీపంలోని గ్రామాల నుంచి రప్పించిన 155 మందిని, వరంగల్ కార్పొరేషన్​ నుంచి రప్పించిన 300 మంది శానిటేషన్​ సిబ్బంది సహాయక చర్యలు, క్లీనింగ్ లో పాల్గొంటున్నారు. ఇద్దరు శానిటరీ ఇన్​ స్పెక్టర్లు, 50 మంది వర్కర్లను నల్గొండ నుంచి రప్పించారు. కాలనీల్లో చెత్తను క్లీన్​ చేయడానికి 28 జేసీబీలను ఉపయోగిస్తున్నారు. ఇరుకు గల్లీల్లో ఉపయోగించుకునేందుకు మినీ జేసీబీని వరంగల్ నుంచి రప్పించారు. జిల్లాలోని వేర్వేరు జీపీల నుంచి 48 వాటర్​ ట్యాంకర్లను తెప్పించి నీటి సప్లై కోసం ఉపయోగిస్తున్నారు.

ఐదు ఫైరింజన్ల ద్వారా కూడా రోడ్లను క్లీన్​ చేస్తున్నారు. 13 మంది ఎంపీడీవోలు, మెప్మా రిసోర్స్​ పర్సన్లు, 26 మంది ఎన్​సీసీ క్యాడెట్లు, 26 మంది ఫారెస్ట్ అధికారులకు వరద బాధితులకు రేషన్​ ప్యాకెట్లు, బట్టల కిట్లను పంపిణీ చేసే బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు 15 వేల రేషన్​ ప్యాకెట్లు, 10వేల బట్టల ప్యాక్​ లు పంపిణీ చేశారు. 45 సర్వే టీమ్​ ల ద్వారా కార్పొరేషన్​ పరిధిలో నష్టం జరిగిన 7,500 ఇండ్లలో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం హౌస్ హోల్డ్ సర్వే పూర్తయిందని, రెండ్రోజుల్లో కంప్లీట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.