బోర్లను మింగిన వాగులు

  • వరదలో కొట్టుకుపోయిన మోటార్లు, స్టార్టర్లు, పైపులు
  • ఒక్క డిండి వాగులోనే 2 వేలకు పైగా గల్లంతు
  • లక్షల్లో నష్టపోయిన పరీవాహక ప్రాంత రైతులు

నాగర్​ కర్నూల్,​ వెలుగు: సాధారణ కంటే 65శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడి వాగుల్లో ట్యూబ్​ వెల్స్, ఒడ్డున బోర్లు వేసుకున్న పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు నిండా మునిగారు.ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 11 మండలాల గుండా ప్రవహించే డిండి(దుందుభి) వాగుకు ఇరువైపులా ఉండే గ్రామాల్లోని వేలాది మంది రైతాంగానికి జీవధారగా నిలిచిన పెద్దవాగు ఈసారి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

నాగర్​ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో దాదాపు 1,800 మంది రైతులకు సంబంధించిన బోర్లు నీట మునిగాయి. పైప్​లైన్లు, కేబుల్​ వైర్లు, స్టార్టర్లు నీటిలో కొట్టుకుపోయాయి. వాగు ఒడ్డున ఉన్న మోటార్లు పనిరాకుండా పోయాయి. వరద ప్రవాహం తగ్గిన తరువాత ఏం ఉన్నాయో.. ఏం పోయాయో తెలుస్తుందని రైతులు చెబుతున్నారు.

వంద గ్రామాల గుండా..

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్​  మండలం నుంచి జిల్లాలో ప్రవేశించే వాగు రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, తాడూరు, కల్వకుర్తి, తెల్కపల్లి, ఉప్పునుంతల, వంగూరు మండలాల మీదుగా డిండి చెరువులో కలుస్తుంది. వాగు ప్రవహించే పరీవాహక ప్రాంతానికి రెండు వైపులా వంద గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల రైతులు వాగులో వేసుకున్న బోర్ల కింద పంటలు, పండ్ల తోటలు సాగు చేసుకుంటున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట  నియోజకవర్గాల్లో నల్లమల అడవిలో కురిసే వర్షం పెద్దవాగులో కలుస్తుంది. నాగర్ కర్నూల్​ నియోజకవర్గంలో రెండు మండలాలు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక మండలం, అచ్చంపేట నియోజకవర్గంలో మూడు మండలాల్లో పంటల సాగుకు ఈ వాగే ఆధారం.

కల్వకుర్తి కెనాల్​ పరిధిలోకి రాని గ్రామాల పరీవాహక ప్రాంత రైతాంగం వాగు మధ్యలో, ఒడ్డున బోర్లు వేసుకున్నారు. కిలోమీటర్ల పొడవునా పైప్​లైన్లు వేసుకున్నారు. దీనికి కేబుల్స్​ ఏర్పాటు చేసుకున్నారు. అప్పులు చేసి మరీ లక్షలు ఖర్చు చేసిన రైతులకు ఈసారి వాగు కన్నీళ్లను మిగిల్చింది. మూడేండ్ల కింద డిండివాగులో ప్రవాహం వచ్చినా, ఈసారి వచ్చినంత రాలేదు. వాగులోని బోర్​ మోటార్లతో పాటు పలు ప్రాంతాల్లో పొలాలను వరద ముంచెత్తింది.

కోనసీమను తలదన్నేలా పంటల సాగు..

తాడూరు మండలంలో డిండి పరీవాహక ప్రాంత రైతులు కోనసీమను తలదన్నేలా వాణిజ్య పంటలు, తోటలు సాగు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో వరి, వేరు సెనగ, పత్తి, మొక్క జొన్న పంటలకు డిండి వాగుపై ఆధారపడతారు. ఈ దశలో డిండి వాగుకు భారీ వరద రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రవాహం తగ్గి పంట పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లేంత వరకు ఏం చేయడానికి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

బోరు వేయడానికి రూ.1లక్ష వరకు ఖర్చు వచ్చిందని, వరదలో కొట్టుకుపోయిన బోర్​ మోటార్లు, పైప్​లైన్లు, కేబుల్​ బాగు చేసుకోవడానికి దాదాపు రూ.20 వేల వరకు ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు.