ఆర్టీసీ బస్సులపై 6వేల చలాన్లు పెండింగ్...హైదరాబాద్ సిటీలోనే 3వేల ఫైన్లు

  • ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చలాన్లే ఎక్కువ
  • జరిమానా చెల్లించాల్సి బాధ్యత డ్రైవర్లదే అంటున్న యాజమాన్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులపై 6వేల చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 3వేల చలాన్లు పడ్డాయి. 2024లో ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఫ్రీ లెఫ్ట్ క్లోజ్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేశారు. బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సిగ్నల్ జంప్ చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.

ట్రాఫిక్ చలాన్లలో వీటికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఫ్రీ లెఫ్ట్​ను క్లోజ్ చేసేలా బస్సులు నిలపడంతో కూడా చలాన్లు పడ్డాయి. పెండింగ్ చలాన్లే 6వేలు ఉంటే.. ఫైన్​లు చెల్లించిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే పెద్దమొత్తంలోనే ఉంటాయి. పెండింగ్ చలాన్లు.. బస్ డ్రైవర్లే కట్టాల్సి ఉంటుంది. అందుకే చాలా వరకు చలాన్లు పెండింగ్​లో ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. డ్యూటీలో ఏ డ్రైవర్ ఉంటే.. అతనే ఆ చలాన్ చెల్లించాలనే నిబంధన ఆర్టీసీలో ఉన్నది. 

ప్రమాదాల సంఖ్య తక్కువే అంటున్న మేనేజ్​మెంట్

బస్సులతో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా తక్కువ అని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇతర వాహనాలతో పోలిస్తే 1 లేదా 2 శాతం మాత్రమే బస్ కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అద్దె బస్సుల కారణంగా ప్రమాదం జరిగినా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. వాటికి ఆర్టీసీ మేనేజ్​మెంట్ బాధ్యత వహించదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సిటీలోని కొత్తగూడ చౌరస్తాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె చనిపోయింది.

అయితే, అది ఈవీ బస్సు కావడం, ఆర్టీసీ అద్దెకు తీసుకోవడంతో దానికి మేనేజ్​మెంట్ బాధ్యత వహించదనేది అధికారుల వాదన. ఎలాంటి సమస్య ఎదురైనా సదరు బస్సు ఓనరే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఆర్టీసీ కిందే సేవలు అందిస్తున్నప్పటికీ.. తమకు సంబంధం లేదని మేనేజ్​మెంట్ చెప్తుండటంతో ఒక్కోసారి బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.