తెలంగాణ కిచెన్ : కాకరకాయతో వెరైటీలు

కాకర ఎంత చేదో అంత రుచి కూడా. కాకరకాయ కూర, వేపుడు, స్టఫింగ్​ అంటూ రకరకాల వంటకాలు చేస్తారు చాలావరకు. వీటితో పాటు ఇంకొన్ని వెరైటీలు చేసుకుంటే కాకరకాయను ఇంకా ఎక్కువ ప్రేమించొచ్చు. ఎందుకంటే ఒక్కో స్టయిల్​ వంటకం ఒక్కో రుచి ఇస్తుంది కాబట్టి. అందుకని ఈసారి కాకరని ఇక్కడ చెప్పిన స్టయిల్​లో వండి టేస్టీ రెసిపీ రెడీ చేసేయొచ్చు.

కాకరకాయ తొక్కు

కావాల్సినవి :

కాకరకాయలు (తెలుపురంగువి) - ఐదు
ఉప్పు - సరిపడా
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఎండు మిర్చి - పది
మెంతులు - ఒక టీస్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - మూడు
బెల్లం - 750 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు
ఆవాలు - ఒక టీస్పూన్
కరివేపాకు - కొంచెం

తయారీ : కాకరకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. నెయ్యి వేడి చేసి ఎండు మిర్చి వేగించి పక్కన పెట్టాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి అందులో నీళ్లు పిండిన కాకరకాయ ముక్కల్ని,  పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. ఎండు మిర్చి, మెంతులు రోట్లో మెత్తగా దంచి కాకరకాయ మిశ్రమం వేయాలి. బెల్లం, ఉప్పు, చింతపండు కూడా వేసి మెత్తగా దంచాలి. నూనె వేడి చేసి కరివేపాకు, ఎండు మిర్చి, ఆవాలు వేగించాలి. అందులో రెడీ చేసిన తొక్కు వేసి కలపాలి. దీన్ని గాలిచొరబడని గాజు సీసాలో నిల్వ చేస్తే.. పదిహేను రోజులు ఫ్రెష్​గా ఉంటుంది. వేడి వేడి అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీల్లోకి సూపర్​ కాంబినేషన్.

కాకర కిస్మిస్​​

కావాల్సినవి :

కాకర కాయలు - ఎనిమిది
జీడిపప్పులు, కిస్మిస్​(ఎండుద్రాక్ష) - ఒక్కోటి అర కప్పు చొప్పున
నూనె, ఉప్పు - సరిపడా 
ఇంగువ - పావు టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిగడ్డలు - మూడు కారం - ఒక టీస్పూన్ 
ఆమ్​చూర్ పొడి, చాట్ మసాలా - ఒక్కోటి ఒకటిన్నర టీస్పూన్​
చక్కెర - ఒక టేబుల్ స్పూన్
 నిమ్మరసం - కొద్దిగా 

తయారీ : ఉల్లిగడ్డలు సన్నగా తరిగి బ్రౌన్​ రంగు వచ్చే వరకు వేగించాలి. కాకరకాయల్ని చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని గుండ్రంగా రింగుల్లా తరగాలి. నూనె వేడి చేసి తరిగిన కాకరకాయ ముక్కల్ని వేసి వేగించాలి. వేరే పాన్​లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి అందులో ఇంగువ, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. అందులోనే జీడిపప్పు పలుకులు, కిస్మిస్​ కూడా వేయాలి. వేగించిన కాకరకాయ ముక్కల్లో వేగించిన ఉల్లిగడ్డ తరుగు కలపాలి. అందులోనే ఆమ్​చూర్ పొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం కలిపి తినాలి. 

కాకర పొడి కూర

కావాల్సినవి :

కాకరకాయలు - 300 గ్రాములు
ఉప్పు - సరిపడా, శనగ పిండి - రెండు టేబుల్ స్పూన్లు
పసుపు, కారం, జీలకర్ర పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్ చొప్పున
వాము, పసుపు, ఆమ్​చూర్ పొడి - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, చక్కెర - చిటికెడు, కొత్తిమీర - కొంచెం

తయారీ : కాకరకాయల్లోని గింజలు తీసేసి, చిన్న ముక్కలుగా తరగాలి. వాటిలో ఉప్పు, పసుపు కలపాలి. ఉల్లిగడ్డలు సన్నగా, పొడవుగా తరగాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులో వాము, కాకరకాయ ముక్కలు కలపాలి. తర్వాత కారం, పసుపు వేసి మరికాసేపు వేగించాక శనగపిండి వేసి కలపాలి. ఆ తర్వాత ఆమ్​చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చక్కెర, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి.

కాకర - కోడికూర

కావాల్సినవి :

కాకరకాయలు - రెండు
చికెన్ - అర కిలో
కరివేపాకు, పుదీనా - కొంచెం
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
పసుపు - సరిపడా
కారం - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లిగడ్డలు - మూడు

తయారీ : కాకరకాయ ముక్కల్లో నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేగించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి  చికెన్ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. కాసేపయ్యాక పసుపు కూడా వేసి కలపాలి. అవసరమైతే నీళ్లు పోసి ఉడికించాలి. చికెన్ ఉడికాక అందులో పుదీనా, ధనియాల పొడి కలపాలి. మరికాసేపు ఉడికాక అందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. కారం కూడా వేసి అవసరమైతే మరికొన్ని నీళ్లు పోయాలి. మూత పెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్​ చేయాలి.

కాజు కరేలా

కావాల్సినవి :

కాకరకాయలు - కిలో
ఉప్పు - సరిపడా
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, గరం మసాలా - ఒక్కోటి పావు టీస్పూన్
జీడిపప్పు - పావు కప్పు
నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి, జీలకర్ర పొడి - ఒక్కో టేబుల్ స్పూన్
కారం - అర టీస్పూన్
చక్కెర పొడి - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొంచెం

తయారీ : కాకరకాయలపైన కాస్త చెక్కు తీసి రింగులుగా తరగాలి. ముక్కల మీద ఉప్పు చల్లాలి. కాసేపయ్యాక  నీళ్లు పిండేయాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, జీడిపప్పులు వేగించాలి. అందులోనే నువ్వులు, కాకరకాయ ముక్కలు కూడా వేగించాలి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు కలపాలి. తర్వాత చక్కెర పొడి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే కాజు కరేలా రెసిపీ రెడీ.